బారామతి ఉపఎన్నికకు అజిత్ పవార్ భార్య నామినేషన్.. ఏకగ్రీవం కోసం కాంగ్రెస్‌కు విజ్ఞప్తి
ABN , Publish Date - Apr 06 , 2026 | 08:45 PM
బారామతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు దివంగత అజిత్ పవార్ భార్య, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సునేత్ర పవార్ సోమవారంనాడు నామినేషన్ వేశారు.
ముంబై: బారామతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు దివంగత అజిత్ పవార్ భార్య, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ సునేత్ర పవార్ (Sunetra Pawar) సోమవారంనాడు నామినేషన్ వేశారు. తన ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీకి ఆమె విజ్ఞప్తి చేశారు. బీజేపీ పొత్తుతో ఈ ఉప ఎన్నికలో సునేత్ర పోటీ చేస్తున్నారు. అజిత్ పవార్ మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.
నామినేషన్ అనంతరం మీడియాతో సునేత్ర పవార్ మాట్లాడుతూ, ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు విజ్ఞప్తి చేయనున్నట్టు చెప్పారు. బారామతి అభివృద్ధికి శరద్ పవార్, ఆ తరువాత తన భర్త చేసిన కృషిని తాను మరింత ముందుకు తీసుకు వెళ్తానని తెలిపారు.
కాగా, బారామతి నుంచి తమ అభ్యర్థిగా ఆకాశ్ విజయరావ్ మోర్‌ను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు ప్రకటించింది. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఆకాశ్ మోర్ పనిచేస్తున్నారు. ఆయన తండ్రి విజయరావ్ మోర్ మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడుగా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం బారామతి అసెంబ్లీ నియోజవకవర్గం ఉపఎన్నిక ఏప్రిల్ 23న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
కోల్‌కతాను పాక్ టార్గెట్ చేస్తామంటే ఉలకరేం?.. మోదీపై మమత ఫైర్
బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత