గురుకులాలు, మదర్సాల విద్యపై జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:49 PM
గురుకులాలు, మదర్సాల్లో విద్యాభ్యాసంపై ప్రముఖ కవి, జాతీయ పురస్కార గ్రహీత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయా సంస్థల్లో విద్యాభ్యాసం పూర్తి చేసే పిల్లల మనసులు విషంతో నిండి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ముంబై, నవంబర్ 28: గురుకులాలు, మదర్సాల్లో విద్యాభ్యాసంపై ప్రముఖ కవి, జాతీయ పురస్కార గ్రహీత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయా సంస్థల్లో విద్యాభ్యాసం పూర్తి చేసే పిల్లల మనసులు విషంతో నిండి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ మహాత్మా ఫూలే సమతా పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ఛగన్ భుజ్బల్ చేతుల మీదుగా మహాత్మా ఫూలే సమతా అవార్డు-2026ను జావేద్ అక్తర్ స్వీకరించారు. అనంతరం భారతదేశ విద్యావ్యవస్థపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు
ఈ సందర్భంగా జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. భారతదేశంలోని పేద పిల్లలకు విద్యావకాశాలు అందుబాటులో లేకపోవడంపై పలు ప్రశ్నలు సంధించారు. దేశంలో ప్రతిభావంతులైన, తెలివైన విద్యార్థులు చాలా మంది ఉన్నప్పటికీ పేదరికం కారణంగా వారికి కనీస విద్యావకాశాలు దక్కడం లేదని అభిప్రాయపడ్డారు. విద్య ఖరీదైనదిగా మారిందని, కేవలం ఒక నిర్దిష్ట వర్గం మాత్రమే దానిని భరించగలదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే రిక్షా లాగే వారి బిడ్డ ఎక్కడ చదువుకుంటుందని ఆయన ప్రశ్నించారు. అలాగే, ఆ చిన్నారి నాసిరకం విద్యా విధానం ఉన్న పాఠశాలకు వెళితే అక్కడ మంచి ఉపాధ్యాయులు, సరైన పాఠ్యప్రణాళికలు ఉండవన్నారు. ఇదే సమయంలో మదర్సా లేదా గురుకులం నుంచి విద్యాభ్యాసం పూర్తైన వారి మనసు విషంతో నిండి ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భారత రాజ్యాంగం ప్రకారం విద్య ప్రభుత్వ బాధ్యతని జావేద్ అక్తర్ పేర్కొన్నారు. 80 నుంచి 85 కోట్ల మందికి ఆహారం అందిస్తున్న ప్రభుత్వం.. అంతే సంఖ్యలో ప్రజలకు విద్యను ఎందుకు అందించలేకపోతోందని ప్రశ్నించారు. 'ఆహారం కంటే చదువు ముఖ్యమైనది కాదా?, కడుపు నిండినా తల ఖాళీగానే ఉంటుంది. తల ఖాళీగా ఉండాలని మీరెందుకు కోరుకుంటున్నారు?' అని ఆయన ప్రశ్నించారు. ఒకరికి విద్యను అందిస్తే వారు రెండు పూటల భోజనం కోసం మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఉండదు కదా? అని నిలదీశారు. వీటన్నింటికీ కుల వ్యవస్థే కారణమని ఆయన ఆరోపించారు. శారీరక శ్రమ చేసే వారికి విద్యను నిరాకరించిన కుల వ్యవస్థ కారణంగానే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని జావేద్ అక్తర్ మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
సంక్రాంతి వేళ గుడ్ న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లు..
అఖిలేష్ రామమందిర పర్యటన.. యూపీ సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు..