Share News

ప్రధాని మోదీకి జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ ఫోన్.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..

ABN , Publish Date - Nov 24 , 2026 | 08:02 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మంగళవారం ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారత్‌-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, భారత్‌-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల నేతలు చర్చించారు.

ప్రధాని మోదీకి జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ ఫోన్.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..
PM Narendra Modi

న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఇవాళ (మంగళవారం) ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారత్‌-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, భారత్‌-యూరోపియన్ యూనియన్ (ఈయూ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల నేతలు చర్చించారు. రక్షణ, అధునాతన సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై మంతనాలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ శాంతి, స్థిరత్వానికి సంబంధించిన అంశాలపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఓ ప్రకటన విడుదల చేసింది.


ప్రధానమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిపై మోదీ, మెర్జ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాదితో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించాలని ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు. ముఖ్యంగా రక్షణ రంగం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వంటి కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా భారత్‌-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా చర్చకు వచ్చింది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మోదీ, మెర్జ్ అభిప్రాయపడ్డారు.


ఇదే సమయంలో ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా మోదీ, మెర్జ్ చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. అలాగే, ప్రస్తుత ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు బహుళపక్ష అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారాన్ని కొనసాగించడం అవసరమని స్పష్టం చేశారు. తాజా ఫోన్ సంభాషణతో భారత్‌-జర్మనీ సంబంధాలను రక్షణ, సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఇరుదేశాల నిబద్ధత మరోసారి వెల్లడైంది. కాగా, సెప్టెంబర్ 10న కూడా ప్రధాని మోదీ, మెర్జ్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి

మారిషస్‌‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..

సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ

Updated Date - Nov 24 , 2026 | 08:06 PM