Share News

వేధింపులపై ప్రశ్నించినందుకు యువతిని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:07 PM

రైలులో అసభ్యకరంగా తాకడాన్ని ప్రశ్నించిన యువతిపై ఒక దుండగుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను రైలు నుంచి తోసేశాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది.

వేధింపులపై ప్రశ్నించినందుకు యువతిని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు

ఇంటర్నెట్ డెస్క్: రైలులో అసభ్యకరంగా తాకడాన్ని ప్రశ్నించిన యువతిపై ఒక దుండగుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను రైలు నుంచి తోసేశాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ నగరంలోని బోరివలి నుంచి విరార్‌కు చేరుకునేందుకు ఓ యువతి లోకల్ ట్రైన్ ఎక్కారు. ఆ రైలులో తోటి ప్రయాణికుడు ఆమె దగ్గరకు వెళ్లాడు. తరువాత ఆ యువతిని అసభ్యకరంగా తాకడం, వేధించడం మొదలుపెట్టాడు. దీన్ని ఆమె ప్రశ్నించారు. కోపంతో అతడిపైకి తన చెప్పు విసిరేశారు. దీంతో ఆ నీచుడు మరింత రెచ్చిపోయాడు. అతడు కూడా ఆమెపై తన చెప్పు విసిరాడు. నాయిగావ్ స్టేషన్ సమీపించేగానే రైలు నుంచి యువతిని తోసేశాడు. రెండు బోగీల మధ్య పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రైలు చక్రాల కింద ఆ బాధితురాలి ఎడమ చెయ్యి పడి నలిగిపోయింది.


అక్కడ ఉన్న రైల్వే సిబ్బంది, కొందరు ప్రయాణికులు సదరు యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు ఆమె ఎడమ చేతిని కోల్పోయినట్టు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

నాకు న్యాయం చేయండి.. బాధితురాలి ఆవేదన

వైద్య చికిత్స అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడారు. తనను అసభ్యకరంగా తాకడాన్ని నిలదీసినందుకు రైలు నుంచి నిందితుడు తోసేశాడని ఆవేదన చెందారు. అతడి వల్ల తన జీవితం నాశనమైందని వాపోయారు. తనకు న్యాయం చేయాలని, నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


ఈ వార్తలూ చదవండి

బిహార్‌లో దారుణం.. అత్యాచార బాధితురాలిని మేడపై నుంచి తోసేసిన దుండగులు

ఫరీదాబాద్ కాల్పుల కేసు.. బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్

Updated Date - Nov 12 , 2026 | 01:10 PM