అప్పుడే పుట్టిన చిన్నారిని చంపేసిన తల్లి.. విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ABN , Publish Date - Apr 23 , 2026 | 01:38 PM
కర్ణాటక రాష్ట్రం దేవనహళ్లిలోని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలో రేణుక అనే 19ఏళ్ల యువతి కొన్నాళ్లుగా పని చేస్తోంది. ఆమె విధుల్లో ఉండగా బుధవారం నాడు విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో బాత్ రూమ్‌కి వెళ్లి అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే..
బెంగళూరు: కర్ణాటకలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన బిడ్డను కన్న తల్లే చంపేయడం తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న యువతి ఈ దారుణానికి పాల్పడింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఓ అగ్రగామి సంస్థలో ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై కేసు నమోదు చేసి యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేవనహళ్లిలోని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలో రేణుక అనే 19 ఏళ్ల యువతి కొన్నాళ్లుగా పని చేస్తోంది. ఆమె విధుల్లో ఉండగా బుధవారం నాడు విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో బాత్ రూమ్‌కి వెళ్లింది. అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు సదరు యువతి.. ఆ చిన్నారిని అక్కడే చంపేసింది. గొంతు కోసి మరీ హత్య చేసి సంచిలో పడేసింది. అనంతరం కంగారు పడుతూ అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత బాత్ రూమ్‌కి వెళ్లిన మరో మహిళ.. రక్తం, సంచిలో చిన్నారి మృతదేహం ఉండటాన్ని గుర్తించింది. విషయం సంస్థ అధికారులకి చేరవేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. యువతిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా.. తనకు ఇంకా వివాహం కాలేదని, ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం వల్ల గర్భవతి అయినట్లు తెలిపింది. అందుకే పుట్టిన వెంటనే చిన్నారిని చంపేసినట్లు వెల్లడించింది. ఆమె చెప్పిన విషయం అక్కడున్న వారిని షాక్‌కు గురి చేసింది. అనంతరం నిందితురాలి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవ దహనం..
పెట్రోల్, డీజిల్ ధరలు రూ.28 మేర పెరగవచ్చంటూ వార్త.. ఖండించిన కేంద్రం