'కేరళ' పేరు మార్పు సహా సోమవారం ఆరు కీలక బిల్లులు!
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:33 PM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రేపు లోక్‌సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటిలో కేరళ పేరు మార్పు, ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు, గనులు, ఖనిజాల చట్ట సవరణ తదితర బిల్లులున్నాయి.
ఢిల్లీ, ఆగస్టు 9: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రేపు (సోమవారం) లోక్‌సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేరళ పేరు మార్పు (Kerala Alteration of Name Bill, 2026) కేరళ రాష్ట్రం పేరును 'కేరళం'గా మారుస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
వివిధ ట్రిబ్యునళ్ల చైర్‌పర్సన్లు, సభ్యుల నియామకాలు, సేవా నిబంధనలలో పారదర్శకత, స్వతంత్రతను పెంచేందుకు ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు (Tribunals Reforms Bill, 2026) చట్టసభల ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీనిని ప్రవేశపెడతారు.
గనులు, ఖనిజాల చట్ట సవరణ (MMDR Amendment Bill, 2026): గనులు, ఖనిజాల అభివృద్ది, క్రమబద్ధీకరణ చట్టం-1957కు సవరణలు చేసే బిల్లును కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సమర్పిస్తారు.
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు: ఎన్సీడీసీ (NCDC) చట్టం-1962కు సవరణలు చేస్తూ రూపొందించిన ఈ బిల్లును కూడా అమిత్ షా సభలో ప్రవేశపెట్టనున్నారు.
రాజ్యసభలో చర్చకు రానున్న బిల్లులు
బ్యాంకర్ల పుస్తకాల నిరూపణ బిల్లు (Bankers' Books Evidence Bill, 2026): డిజిటల్ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా బ్యాంకింగ్ సాక్ష్యాధారాల చట్టాన్ని ఆధునీకరించే ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలన, ఆమోదం కోసం మూవ్ చేస్తారు.
పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లు: పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007, ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్-2025 లలో అవసరమైన సవరణల కోసం ఈ బిల్లును ఎగువసభ పరిశీలించనుంది.
ఈ కీలక బిల్లులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జయంత్ చౌదరి తదితరులు సంబంధిత అధికారిక పత్రాలను సభ సమక్షంలో ఉంచనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు
భాగ్యనగర మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: కేటీఆర్