సీఎం విజయ్‌తో కలిసి తమిళనాడును ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:52 PM
చెన్నై పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం విజయ్ ఒకే వేదికను పంచుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని మోదీ పేర్కొన్నారు.
Modi Vijay Chennai Visit:తమిళనాడు రాజధాని చెన్నైలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఒకే వేదికను పంచుకున్నారు. రాష్ట్రాల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపిన ప్రధాని మోదీ.. సీఎం విజయ్‌తో కలిసి తమిళనాడు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
చెన్నై ట్రేడ్ సెంటర్, ఐఐటీ మద్రాస్ ఆవరణలోని కేంద్రీయ విద్యాలయ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో రూ. 13,000 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభం
చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2 కింద కారిడార్-4లోని పూనమల్లి - వడపళని మార్గాన్ని (సుమారు 15 కిలోమీటర్లు, 11 స్టేషన్లు) ప్రధాని మోదీ, సీఎం విజయ్‌తో కలిసి ప్రారంభించారు. పూనమల్లి బైపాస్ నుంచి పోరూర్ వరకు ఇరు నేతలు కలిసి మెట్రో రైలులో ప్రయాణించి, విద్యార్థులు, పౌరులతో ముచ్చటించారు. ప్రధాని మోదీ యూపీఐ (UPI) ద్వారా మెట్రో టికెట్ కొనుగోలు చేయడం విశేషం.
భారత తయారీ రంగం పెరగడంలో తమిళనాడు పాత్ర కీలకమని ప్రధాని ప్రశంసించారు. 2014 నుంచి భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు.
తూత్తుకుడిలోని చిదంబరనార్ పోర్ట్‌ను ప్రపంచ స్థాయి గ్రీన్ ఎనర్జీ అండ్ మెగా కంటైనర్ హబ్‌గా మార్చడానికి రూ. 17,000 కోట్లతో పనులు వేగవంతం చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.
కార్యక్రమంలో ప్రసంగించిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చెన్నై మెట్రో ఫేజ్-3 పొడిగింపు (ఎయిర్‌పోర్ట్-కిల్‌పాక్కం, పూనమల్లి-సుంగువార్‌సత్రం) కు తక్షణమే ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు. చెన్నై నుంచి కన్యాకుమారి, చెన్నై నుంచి కోయంబత్తూర్ మార్గాల్లో హైస్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలూ చదవండి
బీసీసీఐకి గంభీర్ హెచ్చరిక.. పిచ్‌లు మారకపోతే భారత క్రికెట్‌కు నష్టమే!
ఆటగాళ్ల మార్పులే అసలు సమస్య.. గంభీర్‌పై సీఎస్కే మాజీ స్టార్ విమర్శలు