కోవిడ్ విషాదాలను మోదీ మరచిపోయారా... రాహుల్ గాంధీ
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:33 PM
పశ్చిమాసియా ఉద్రిక్తతలను గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడుతూ పరిస్థితి కోవిడ్ తరహాలా ఉందంటూ పేర్కొనడంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో జరిగిన విషాదాల గురించి ఆయన మరిచిపాయారా? అని ప్రశ్నించారు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలను గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడుతూ పరిస్థితి కోవిడ్ తరహాలా ఉందంటూ పేర్కొనడంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో జరిగిన విషాదాల గురించి ఆయన మరిచిపాయారా? అని ప్రశ్నించారు. పార్లమెంటు వెలుపల మీడియాతో రాహుల్ మంగళవారంనాడు మాట్లాడారు.
'పార్లమెంటులో ఆయన (మోదీ) నిన్న సందర్భోచితం కాని మాటలు మాట్లాడారు. కరోనా మహమ్మారితో ప్రస్తుత సందర్భాన్ని పోల్చారు. ఎల్పీజీ, పెట్రోల్ ధరల్లో ఇప్పుడే పెరుగుదల మొదలైంది. ఇంతలోనే పరిస్థితిని కరోనా మహమ్మారి రోజులతో ఆయన పోలుస్తున్నారు. కరోనా విరుచుకుపడిన సమయంలో జరిగిన విషాదాల గురించి ఆయన మరిచిపోయినట్టున్నారు' అని రాహుల్ అన్నారు.
దేశ విదేశాంగ విధానంపై రాహుల్ విమర్శలు గుప్పిస్తూ, దేశ విదేశాంగ విధానం మోదీ వ్యక్తిగత విదేశాంగ విధానంగా మారిందని, అంతర్జాతీయంగా ఇదొక హాస్యాస్పద అంశంగా మారిందని అన్నారు. 'మోదీ రాజీపడితే మన విదేశాంగ విధానం కూడా రాజీపడినట్టే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ రాజీకొచ్చినట్టే కనిపిస్తోంది' అని వ్యాఖ్యానించారు.
అఖిలపక్షానికి వెళ్లలేక పోవచ్చు..
మధ్యఆసియాలో పరిణామాలపై ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశంపై అడిగినప్పుడు, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినా సరిదిద్దుకోలేని నిర్మాణాత్మక తప్పిదం జరిగిందని అన్నారు. అమెరికా ఏది చెబితే ఆది మోదీ చేస్తారని, రైతులు, దేశ ప్రయోజనాల కోసం పనిచేయరని విమర్శించారు. కేరళలో తనకు ప్రోగ్రాం ఉన్నందున అఖిల పక్ష సమావేశానికి హాజరుకాకపోవచ్చని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
పశ్చిమాసియాలో పరిణామాలపై మోదీ అధ్యక్షతన 25న అఖిలపక్ష సమావేశం
యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రభావం ఉంది: మోదీ