Share News

ఇది కరోనా తరహా సంక్షోభం

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:54 AM

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం తీవ్రంగానే ఉందని, ఇది కరోనా తరహా సంక్షోభ పరిస్థితి అని ప్రధాని మోదీ అభివర్ణించారు.

ఇది కరోనా తరహా సంక్షోభం

  • కలిసికట్టుగా ఎదుర్కొందాం

  • ఇంధనం, ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు: మోదీ

న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం తీవ్రంగానే ఉందని, ఇది కరోనా తరహా సంక్షోభ పరిస్థితి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలపై యుద్ధం ప్రభావం చూపుతోందని, భారత్‌ కూడా అసాధారణ సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. యుద్ధ ప్రభావం దీర్ఘకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోందని.. దేశ ప్రజలంతా కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో కొందరు వదంతులు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని కోరారు. ఇరాన్‌- అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధంతో భారత్‌కు ఎదురవుతున్న సవాళ్లపై ప్రధాని మోదీ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. ‘‘పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన క్లిష్టమైన పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగే అవకాశముంది. కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి సమయంలో మనం ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాం. ఇప్పుడు మళ్లీ అదే తరహా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం. రోజువారీ ఎగుమతులు, దిగుమతులకు సవాళ్లను రోజువారీగా సమీక్షిస్తూ.. పరిష్కారాలను అన్వేషిస్తున్నాం’’ అని తెలిపారు.

ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాం..

కోవిడ్‌ మహమ్మారి, తర్వాత యుద్ధాల కారణంగా కొరత తలెత్తి అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు అత్యంత భారీగా పెరిగాయని మోదీ చెప్పారు. ఆ ప్రభావం మన దేశ రైతులపై పడకుండా చూసుకున్నామన్నారు. అంతర్జాతీయంగా ఒక యూరియా బస్తా ధర రూ.3 వేలు ఉంటే.. దేశంలో రైతులకు రూ.300కే అందించామని తెలిపారు. సబ్సిడీల కోసం తమ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు వ్యయం చేసిందన్నారు. దేశంలో ఎరువులు తగిన మొత్తంలో ఉన్నాయని, రైతులకు ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్నామని తెలిపారు. వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతుందని, విద్యుత్‌ సరఫరా వ్యవస్థలు, బొగ్గు నిల్వలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.


భారతీయుల రక్షణకు చర్యలు

గల్ఫ్‌ దేశాల్లో కోటి మంది వరకు భారతీయులు ఉన్నారని, దీనితో భారత్‌ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందని మోదీ చెప్పారు. కొందరు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు గాయపడ్డారని.. వారందరికీ తగిన సహాయం అందుతోందని తెలిపారు. గల్ఫ్‌ దేశాల నుంచి 3 లక్షలమందికిపైగా భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారని చెప్పారు. ఇరాన్‌ నుంచి వెయ్యి మంది తిరిగివచ్చారని తెలిపారు. పశ్చిమాసియా దేశాల నేతలందరితోనూ మాట్లాడానని, భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపట్టాల్సిందిగా కోరానని వివరించారు. యుద్ధాన్ని ఆపేందుకు భారత్‌ ప్రయత్నిస్తోందని.. చర్చల ద్వారా ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ కొరత లేకుండా చూస్తున్నాం..

దేశ ప్రజలకు సాధ్యమైనంత మేరకు ఇంధన కష్టాలు లేకుండా చూస్తున్నామని మోదీ చెప్పారు. భారత్‌ 60 శాతం ఎల్పీజీ (వంట గ్యాస్‌)ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని, హోర్ముజ్‌ మూసివేతతో సరఫరాలో అనిశ్చితి ఏర్పడిందని తెలిపారు. ఈ క్రమంలో దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచామని వివరించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా నిరాటంకంగా సాగుతోందని.. రకరకాల మార్గాల నుంచి చమురు, గ్యాస్‌ను సమీకరిస్తున్నామని తెలిపారు. మొత్తం 41 దేశాల నుంచి ఇంధన దిగుమతులు జరుగుతున్నాయని చెప్పారు. అదే సమయంలో దేశంలో సౌర శక్తి, అణు ఇంధన శక్తి సామర్థ్యాన్ని పెంచుతున్నామని వివరించారు. ప్రస్తుత సంక్షోభాల వంటి పరిస్థితుల్లో బ్లాక్‌ మార్కెట్‌ దందాలు చేసేవారు, నిల్వదారులు లాభం పొందేందుకు ప్రయత్నిస్తారని.. అలాంటి వాటిని నియంత్రించేందుకు భద్రతా వ్యవస్థలను కట్టుదిట్టం చేశామని చెప్పారు. ఎవరైనా గ్యాస్‌ సిలిండర్లు, పెట్రోల్‌, డీజిల్‌ వంటివాటిని భారీగా నిల్వ చేస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి ప్రయోజనం పొందేందుకు కొందరు వదంతులను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తారని, జాగ్రత్త పడాలని సూచించారు.

Updated Date - Mar 24 , 2026 | 04:54 AM