ఫిలిప్పీన్స్ పర్యటన వేళ.. ప్రపంచ నేతలకు మోదీ అపురూప బహుమతులు
ABN , Publish Date - Nov 18 , 2026 | 02:19 PM
రెండు ప్రాంతీయ శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొనేందుకు ఫిలిప్పీన్స్‌లోని మనీలాకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు దేశాధినేతలకు కొన్ని బహుమతులను ఆత్మీయంగా ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: రెండు ప్రాంతీయ శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొనేందుకు ఫిలిప్పీన్స్‌లోని మనీలాకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు దేశాధినేతలకు కొన్ని బహుమతులను ఆత్మీయంగా ఇచ్చారు. భారతీయ హస్తకళను, వస్త్ర సంప్రదాయాన్ని, సంస్కృతిక వారసత్వాన్ని అణువణువులోనూ ప్రదర్శించే, ప్రతిబింబించే వస్తువులను బహూకరించారు. మోదీ ఇచ్చిన కానుకలను ఆ నాయకులు ఆనందంగా స్వీకరించారు. రాజస్థాన్‌లో సుప్రసిద్ధమైన గోల్డెన్ పిచ్వాయ్ పెయింటింగ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని బహూకరించారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్‌కు సంప్రదాయమైన కశ్మీరీ పట్టు తివాచీ ఇచ్చారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు చోళ కాంస్య శిల్పాన్ని అందించారు. ఢోక్రా కళాత్మక పడవను కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్‌కు, బిద్రీవేర్ కళారూపాలను మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లైంగ్‌కు, రాయల్ బ్లూ బనారసి పట్టు శాలువాను జపాన్ ప్రధాన మంత్రి సనాయే తకైచికి, జైపూర్ నీలిరంగు మట్టిపాత్ర కళాఖండాన్ని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు బహూకరించారు. రాజస్థాన్, కశ్మీర్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇవి ప్రాచుర్యం పొందాయి.
ముచ్చటగొలిపే గోల్డెన్ పిచ్వాయ్ పెయింటింగ్
రాజస్థాన్‌లో పేరు గాంచిన గోల్డెన్ పిచ్వాయ్ పెయింటింగ్‌ను ట్రంప్‌నకు మోదీ కానుకగా ఇచ్చారు. ఇది సంప్రదాయమైన వస్త్ర చిత్రకళ. దీనిలోని రంగులు, హంగులు ముచ్చటగొలిపేలా ఉంటాయి. ఈ కళాకృతిలోని బంగారు పూత ప్రత్యేమైన ఆకర్షణగా నిలుస్తుంది.
మెరుపు, మృదువుల కలయిక.. కశ్మీరీ తివాచీ
ప్రసిద్ధ కశ్మీరీ తివాచీని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్.. మోదీ నుంచి స్వీకరించారు. చేతితో అల్లిన ఈ పట్టు తివాచీ మెరుపు, మృదువుల కలయిక. సాధారణంగా దీన్ని తయారు చేయడానికి కళా నిపుణులకు సంవత్సరాల కాలం పడుతుంది.
శిల్పకళకు ప్రతిబింబం.. చోళ కాంస్యం..
భారతీయ శిల్పకళను చోళుల కాలం నాటి కాంస్య శిల్పం ప్రతిబింబిస్తుంది. దీన్ని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు ప్రధాని అందించారు. ఈ కళారూపం దక్షిణ భారతదేశంలోని చోళ రాజవంశం పాలనలో 9, 13 శతాబ్దాల మధ్య విలసిల్లింది.
స్వచ్ఛతకు, శ్రేయస్సుకు, ఆతిథ్యానికి ప్రతీక.. ఢోక్రా కళాత్మక పడవ
ఢోక్రా కళాత్మక పడవను కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్‌కు మోదీ ఇచ్చారు. దీన్ని పూలతో సుందరంగా అలంకరిస్తారు. ఈ పడవ స్వచ్ఛతకు, శ్రేయస్సుకు ప్రతీక.
లోహ కళాకృతి.. బిద్రీవేర్
బిద్రీవేర్ అంటే జింక్, రాగి మిశ్రమంతో తయారు చేసిన లోహ కళాకృతి. దీన్ని మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లైంగ్‌కు మోదీ బహూకరించారు.
శ్రేష్ఠమైన పట్టు.. బనారస్
బనారస్ పట్టు శతాబ్దాల నాటి కళకు ప్రతిరూపం. దీన్ని శ్రేష్ఠమైన పట్టుగా అభివర్ణిస్తారు. జపాన్ ప్రధాన మంత్రి సనాయే తకైచికి బనారస్ పట్టు శాలువాను మోదీ అందించారు.
ఈ వార్తలూ చదవండి
కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ హతం