Share News

నేర్చుకోవడంలో నేనెప్పుడూ విద్యార్థిగానే ఆలోచిస్తా: ప్రధాని మోదీ

ABN , Publish Date - Oct 07 , 2026 | 10:47 AM

ప్రజా సేవలో ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక మైలురాయిని పూర్తి చేసుకున్నారు. పాలసీ మేకర్‌గా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో పాల్గొన్నారు.

నేర్చుకోవడంలో నేనెప్పుడూ విద్యార్థిగానే ఆలోచిస్తా: ప్రధాని మోదీ
Viksit Bharat Sankalp Sabha

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవా సంకల్ప జ్యోతి ప్రజ్వలన చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన సేవా సంకల్ప యాత్రికులు కార్యక్రమానికి హాజరయ్యారు.

రాజకీయాల్లో పాలసీ మేకర్‌గా మోదీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి దేశ ప్రజల సేవలోనే తన పాతికేళ్ల ప్రయాణం కొనసాగిందని చెప్పారు.


ప్రజల ఆశీర్వాదమే నాకు బలం..

25 ఏళ్లుగా నిరంతర ప్రజా సేవ అందించే అవకాశం తనకు లభిస్తుందని నాడు తాను ఊహించలేదని మోదీ అన్నారు. ఇంత సుదీర్ఘమైన ప్రజా సేవా ప్రస్థానంలో ప్రజల ఆశీర్వాదమే తనకు ప్రధాన బలంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకం, ఆశీర్వాదంతోనే తాను ముందుకు సాగుతున్నానని చెప్పారు. దేశ ప్రజల సేవలో గడిచిన ఈ పాతికేళ్లు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవని మోదీ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.

ప్రజా సేవ చేసేందుకు భగవంతుడు నాకు శక్తినిచ్చారు..

ప్రజల ఆశీస్సులు, పార్టీ శ్రేణుల మద్దతే తనకు బలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని ఎన్నటికీ మరచిపోలేనని పేర్కొన్నారు. ప్రజా సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తినిచ్చారని, ప్రజలు, దేవుడి ఆశీస్సులతో దేశానికి మరింత సేవ చేస్తానని తెలిపారు. ప్రతి ఘటన నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నానని, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపనతో ఉంటానని మోదీ చెప్పారు. సవాళ్లే తనను మరింత బలంగా నిలబెట్టాయని, దేశం తనకు ఎంతో ఇచ్చిందని.. దేశమే తనకు ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.


నా ప్రత్యర్థులే నన్ను రాటుదేల్చారు..

నేర్చుకోవడంలో తాను ఎప్పుడూ విద్యార్థిగానే ఆలోచిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన తనకు ఉందని, ప్రతి ఘటన నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తున్న సమయంలో విమర్శలు రావడం సహజమేనని, అయితే వాటిని పట్టించుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్లలేమన్నారు. తనను వ్యక్తిగతంగా విమర్శించే వారి వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు కూడా తనను మరింత రాటుదేలేలా చేశాయని, వారు ఎంతగా విమర్శిస్తే తాను అంతగా ఆలోచించేవాడినని మోదీ పేర్కొన్నారు. దేశం తనకు ఎంతో ఇచ్చిందని, అందుకే దేశమే తనకు ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. తనపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రజా సేవలో ముందుకు సాగుతానన్నారు.


ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది..

కలిసికట్టుగా పనిచేస్తే 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించగలమనే విశ్వాసం తనకు ఉందని ప్రధాని మోదీ అన్నారు. ‘వికసిత్ భారత్-2047’, టాప్-3 ఆర్థిక వ్యవస్థ, ఆత్మనిర్భర్ భారత్, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగడం, అంతరిక్ష రంగంలో మరింత ముందుకు సాగడం వంటి లక్ష్యాలను సాధించేందుకు ‘వీ విల్ డూ ఇట్’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. సంకల్పం ఉంటే దేనినైనా సాధించవచ్చని, దేశ ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని, దేశాభివృద్ధికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. పేదరికం, డ్రగ్స్‌ను దేశం నుంచి నిర్మూలించడం, అన్ని రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి పెద్ద లక్ష్యాలతో పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగుతానని మోదీ తెలిపారు.

Updated Date - Oct 07 , 2026 | 12:12 PM