Share News

డీలిమిటేషన్‌పై రాజీ లేదు

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:20 AM

నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) అంశంపై తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ తేల్చిచెప్పారు.

డీలిమిటేషన్‌పై రాజీ లేదు
stalin

  • 7.18శాతం వాటా ఉండాల్సిందే: స్టాలిన్‌

  • బిల్లుకు మద్దతిస్తాం: డీఎంకే సీనియర్‌ నేత

చెన్నై, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) అంశంపై తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ తేల్చిచెప్పారు. ‘‘ఒకవేళ పార్లమెంటరీ నియోజకవర్గాల సంఖ్య పెంచితే ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్‌సభలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం సీట్ల వాటా ఎట్టి పరిస్థితిలోనూ తగ్గకూడదు. అలాగే, 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించి, అప్పట్లో యథాతథంగా ఉంచిన(ఫ్రీజ్‌) రాష్ట్రాల వారీ పార్లమెంటరీ ప్రాతినిథ్య నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటు అలాగే కొనసాగించాలి.’’ అనే రెండు డిమాండ్లకే డీఎంకే కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై తమ పార్టీ వైఖరి గురించి వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. ‘‘మీడియాలో వస్తున్న ఊహాగానాలు గానీ, వెన్నుపోటు పొడిచిన వారి విమర్శలు గానీ మా సంకల్పాన్ని ఏమాత్రం కదిలించలేవు. పదవుల కోసం తమ సిద్ధాంతాలను వదిలేసిన ఆ సిగ్గులేని, కృతజ్ఞత లేని వ్యక్తులు(కాంగ్రెస్‌ సహా గత మిత్రపక్షాల నేతలు) ఈ విషయాన్ని గ్రహించాలి’’ అని వ్యాఖ్యానించారు. కాగా, డీలిమిటేషన్‌ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని డీఎంకేకు చెందిన ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. ఆ ఫార్ములా ప్రకారం లోక్‌సభలో తమిళనాడు సీట్ల సంఖ్య 39 నుంచి 59కు పెరుగుతుందని, దాంతో రాష్ట్ర వాటా 7.18 నుంచి 7.23 శాతానికి చేరుతుందని విశ్లేషించారు. పార్టీ విధానం ప్రకారం పార్లమెంటులో రాష్ట్ర వాటా ఇంకా పెరుగుతున్నందున డీలిమిటేషన్‌ బిల్లుకు తమ పార్టీ మద్దతిచ్చే అవకాశముందని ఆ నేత వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం

డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్

Updated Date - Nov 28 , 2026 | 05:20 AM