ప్రజాతీర్పును శిరసావహిస్తున్నాం. ఎంకే స్టాలిన్ తొలి స్పందన
ABN , Publish Date - May 04 , 2026 | 09:26 PM
తమిళనాడులో డీఎంకే ఓటమిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని, విజేతలను అభినందిస్తున్నామని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు.
చెన్నై: తమిళనాడులో డీఎంకే కూటమి ఓటమిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తొలిసారి స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని, విజేతలను అభినందిస్తున్నామని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు.
డీఎంకే ప్రభుత్వం సాధించిన రికార్డును స్టాలిన్ సమర్ధించుకున్నారు. గత ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. తమిళనాడు ప్రజలకు సుపరిపాలన అందించామని తెలిపారు. అన్ని విధాలుగా తమిళనాడు ఉన్నతికి పాటుపడ్డామని, ప్రభుత్వం సాధించిన విజయాలనే ప్రచారంగా తీసుకుని ఎన్నికలకు వెళ్లామని వివరించారు. డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రసివ్ అలెయన్స్‌కు మద్దతుగా నిలిచి ఓటు వేసిన వారికి, ఓటు వేయడం మరిచిపోయిన వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అంతరాత్మ ప్రబోధం మేరకు ప్రజల కోసమే తాము పనిచేశామని చెప్పారు.
గెలుపు ఓటములు సహజం..
తన రాజకీయ జీవితంలో ఘన విజయాలు, ఓటములను కూడా చవిచూసినట్టు స్టాలిన్ చెప్పారు. కేవలం గెలుపు ఓటముల కంటే సిద్ధాంతాలు, విధానాలు ముఖ్యమన్నారు. ఎలాంటి నిరాశనిస్పృహలకు లోనుకాకుండా డీఎంకే రాజకీయ ప్రయాణానికి కొనసాగిస్తుందని చెప్పారు. ఇంతవరకూ ప్రజల కోసం ఆదర్శప్రాయమైన అధికార పార్టీగా పనిచేసిన డీఎంకే ఇకనుంచి ఆదర్శవంతమైన విపక్ష పార్టీగా పనిచేస్తుందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
బెంగాల్‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ