ప్రధాని పోస్ట్ తొలగింపుపై మెటా అధికారి క్షమాపణ.. సాంకేతిక పొరపాటేనన్న జోయెల్ కప్లాన్..
ABN , Publish Date - Aug 05 , 2026 | 07:27 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడంపై మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ అధికారి జోయెల్ కప్లాన్ వివరణ ఇచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడంపై మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ అధికారి జోయెల్ కప్లాన్ వివరణ ఇచ్చారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరగలేదని, సాంకేతిక లోపం కారణంగానే ఆ వీడియో తాత్కాలికంగా కనిపించలేదని వివరించారు. ఈ మేరకు భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు.
బుధవారం న్యూఢిల్లీలో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ (MeitY) కార్యదర్శి ఎస్. కృష్ణన్‌తో జోయెల్ కప్లాన్ నేతృత్వంలోని మెటా ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పోస్టు తొలగింపు, పిల్లలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ (CSAM) నియంత్రణ, కృత్రిమ మేధస్సుతో రూపొందించిన తప్పుడు సమాచారాన్ని అరికట్టే చర్యలు వంటి అంశాలపై చర్చ జరిగింది.
ఏఐ ఆధారిత ఆటోమేటెడ్ కంటెంట్ ఫిల్టర్లు పనిచేసే సమయంలో జరిగిన పొరపాటు వల్ల ప్రధాని మోదీ వీడియో కొద్దిసేపు కనబడలేదని మెటా వివరణ ఇచ్చింది. అనంతరం తప్పును గుర్తించి పోస్టును పునరుద్ధరించామని పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని, ప్రముఖల ఖాతాలకు అదనపు భద్రతా తనిఖీలు అమలు చేస్తున్నామని కంపెనీ తెలిపింది (Facebook Error Meta Apology).
మెటా ఇచ్చిన వివరణ సరిపోదని, ప్రజా ప్రతినిధుల పోస్టులు తొలగించే ముందు మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత చట్టాలకు అనుగుణంగా కంటెంట్ నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయాలని మెటాకు సూచించింది.
ఇవి కూడా చదవండి..
ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సిందే.. యూపీఐ చార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..
షేక్ హసీనా ప్రసంగంతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదు: విదేశాంగ శాఖ