మరాఠీ పాటకు.. ‘మాయ’ రోబో నృత్యం
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:38 AM
రోబోలకు ఎన్ని తెలివితేటలున్నా.. మనుషుల్లాగా వాటికి సహజమైన కదలికలు ఉండవు. అవి నడుస్తుంటే చాలా కృతకంగా ఉంటుంది. అలాంటిది అవి నాట్యం చేస్తే?
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: రోబోలకు ఎన్ని తెలివితేటలున్నా.. మనుషుల్లాగా వాటికి సహజమైన కదలికలు ఉండవు. అవి నడుస్తుంటే చాలా కృతకంగా ఉంటుంది. అలాంటిది అవి నాట్యం చేస్తే? మరెంత కృతకంగా ఉంటుందో అనుకుంటున్నారా? అయితే.. వెంటనే గూగుల్‌లో ‘మాయ’ అనే రోబో గురించి సెర్చ్ చేసి చూడండి. మీ అపోహలన్నీ పటాపంచలవుతాయ్. ‘మాయ’ ఒక హ్యూమనాయిడ్ రోబో. మనదేశానికి చెందిన ట్యూస్‌డే ల్యాబ్స్, మాస్టర్స్ యూనియన్ సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి.
అవతార్ సినిమా తీసేటప్పుడు ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ వాడిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని, రీయిన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ విధానాన్ని వాడి.. వారు ఈ మాయ రోబోకు నాట్య మెలకువలు నేర్పించారు. దాంతో.. ‘వజ్లే కీ బారా’ అనే మరాఠీ పాటకు నృత్యం చేయించారు. దాని కదలికలు ఏదో రోబోలాగా యాంత్రికంగా కాకుండా.. ఒక సంప్రదాయ నృత్య కళాకారిణి తరహాలో ఎంతో సహజంగా ఉండడంతో నెట్‌లో ఈ డాన్స్ వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, బాల్టిమోర్ కౌంటీ పరిశోధకులు.. రోబోల కదలికలు యాంత్రికంగా కాకుండా మానవుల్లా సహజంగా ఉండేలా చేసేందుకు భరతనాట్యంలోని ముద్రలను ఉపయోగించి ఏఐ సాయంతో శిక్షణ ఇస్తున్నారు.