ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:56 PM
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రద్దీగా ఉండే 'ఝార్పడ వంతెన' సమీపంలో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. లోకో పైలట్లు సకాలంలో స్పందించడంతో ఒక పెద్ద రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది.
భువనేశ్వర్(ఒడిశా) జూన్ 11: ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలో ఇవాళ (జూన్ 11) ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా రావడంతో కలకలం రేగింది. రైల్వే సిబ్బంది సమయానుకూలంగా స్పందించడంతో ఒక పెద్ద రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటన భువనేశ్వర్‌లోని అత్యంత రద్దీగా ఉండే 'ఝార్పడ' (Jharpada) వంతెన సమీపంలో చోటుచేసుకుంది.
ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒక ఖాళీ రైలు భువనేశ్వర్ నుంచి మంచేశ్వర్ వైపు వెళుతుండగా, అదే సమయంలో మరో రైలు దానికి ఎదురుగా అదే ట్రాక్ మీద వస్తోంది. సరిగ్గా ఝార్పడ వంతెన సెక్షన్ వద్ద ఈ రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చేశాయి. అయితే, ఈ లోపాన్నిగుర్తించిన రైల్వే సిబ్బంది, లోకో పైలట్లు అత్యంత వేగంగా స్పందించారు. ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లను చాలా దగ్గరగా సురక్షితంగా నిలిపివేయగలిగారు. ఈ ఘటనతో కాసేపు అక్కడ ఉత్కంఠ, తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ఘటనపై ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రెస్ నోట్ విడుదల చేసింది. షంటింగ్ (షెడ్యూల్డ్ నిర్వహణ.. మరమ్మతులు, క్లీనింగ్) పనుల కోసం ఖాళీ కోచ్‌లను తరలించేటప్పుడు ఈ పొరపాటు జరిగిందని వెల్లడించింది. ఒక ఖాళీ రైలు, అక్కడ అప్పటికే ఆగి ఉన్న మరో ఖాళీ రైలుకు చాలా సమీపంలోకి వచ్చిందని వెల్లడించింది. ప్రమాద సమయంలో రెండు రైళ్లలోనూ ప్రయాణికులు లేరని, ఈ ఘటన ప్రధాన లైన్‌కు దూరంగా జరగడం వల్ల సాధారణ ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని తెలిపింది. అలాగే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సదరు ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.
ఘటనా స్థలానికి రైల్వే సాంకేతిక బృందం, ఉన్నతాధికారులు తక్షణమే చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సిగ్నలింగ్ లోపమా? కమ్యూనికేషన్ ఫెయిల్యూర్? లేదా సిబ్బంది నిర్వహణ లోపమా? అనే విషయాలపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటన కచ్చితమైన కారణాలను తెలుసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
దశాబ్దంగా ఆర్టీసీలో రిక్రూట్‌మెంట్ లేదు: ఈడీ అడ్మిన్‌కు ఉద్యోగ జేఏసీ మెమోరాండం
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం.. వ్యక్తి అరెస్ట్