Share News

ఈ నెల 20 తర్వాత కేంద్ర కేబినెట్‌లో మార్పులు?

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:21 AM

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు తప్పవన్న ప్రచారం ఊపందుకుంది. కనీసం ఐదారుగురు కేబినెట్‌ మంత్రులు, 12 మంది సహాయ మంత్రులను....

ఈ నెల 20 తర్వాత కేంద్ర కేబినెట్‌లో మార్పులు?

  • 17 మంది మంత్రులకు మోదీ ఉద్వాసన!

న్యూఢిల్లీ, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు తప్పవన్న ప్రచారం ఊపందుకుంది. కనీసం ఐదారుగురు కేబినెట్‌ మంత్రులు, 12 మంది సహాయ మంత్రులను ప్రధాని మోదీ తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో కొందరికి పార్టీ బాధ్యతలు కట్టబెడతారని.. ఈ నెల 20తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టవచ్చని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ సోమవారం ఢిల్లీలో పార్టీ ఆఫీసు బేరర్లు, రాష్ట్ర అధ్యక్షులతో చర్చలు జరిపారు. ఆయన నేతృత్వంలో కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటు కావలసి ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రిగా ఉన్న పంకజ్‌ చౌధరిని యూపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇదివరకే నియమించారు. తాజాగా కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్‌ మల్హోత్రా ఢిల్లీ బీజేపీ సారథిగా నియమితులయ్యారు. వీరిని పార్టీ బాధ్యతలకే పరిమితం చేస్తారని అంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 2014 నుంచి మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరిని, 2019 నుంచి మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరిని పక్కకు తప్పిస్తారని తెలిసింది. 60 శాతానికిపైగా మంత్రుల శాఖలు మారవచ్చని సమాచారం. విద్యుత్‌ మంత్రి మనోహర్‌ ఖట్టర్‌, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌లను గవర్నర్లుగా నియమించే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల శాఖల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని.. టీడీపీ నుంచి మరొకరికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వొచ్చని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం

Updated Date - Jun 02 , 2026 | 05:21 AM