మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు ప్రధాని మోదీ ఘన నివాళి
ABN , Publish Date - Jan 30 , 2026 | 09:47 AM
నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ రోజును దేశవ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. జాతిపితకు ఘన నివాళులర్పించారు. మహాత్ముడు ఎల్లప్పుడూ స్వదేశీని నొక్కిచెప్పారని మోదీ చెప్పారు.
న్యూఢిల్లీ, జనవరి 30: నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని భారతదేశం గౌరవంగా జరుపుకుంటోంది. 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా భవన్(ప్రస్తుతం గాంధీ స్మృతి)లోని ప్రార్థనా సమావేశంలో నాథూరాం గాడ్సే కాల్పులు జరపడంతో మహాత్ముడు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజును దేశవ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ దినం(Martyrs' Day)గా పాటిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 'జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. పూజ్య బాపు ఎల్లప్పుడూ స్వదేశీని నొక్కిచెప్పారు. ఇది అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశం కోసం మన సంకల్పానికి మూలస్తంభం కూడా. ఆయన వ్యక్తిత్వం, విజయాలు ఎల్లప్పుడూ మన దేశస్థులను విధి మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తాయి' అని సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
గాంధీ వర్థంతి వేళ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులందరినీ స్మరించుకుంటారు. ఈ ఏడాది మహాత్ముని 78వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజ్ ఘాట్ వద్ద అధికారిక నివాళులు, ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రజాప్రతినిధులు బాపు సమాధుల వద్ద ఘన నివాళులర్పిస్తున్నారు. మహాత్మా గాంధీ జీవితం అహింస, సత్యాగ్రహం, స్వదేశీ, సర్వోదయం వంటి సూత్రాలతో నిండినది. 'హే రామ్' అంటూ ప్రాణాలు విడిచిన ఆ మహానుభావుడి ఆదర్శాలు ఇప్పటికీ ప్రపంచానికి శాంతి, సమానత్వం మార్గాన్ని చూపుతున్నాయి. ఆయన మార్గమే దేశ భవిష్యత్తుకు శిరోధార్యంగా నిలుస్తోంది.
రాహుల్ గాంధీ నివాళి
మహాత్మా గాంధీ ఒక వ్యక్తి కాదు, కానీ ఒక ఆలోచన.. ఒక సామ్రాజ్యం అని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. హింస, భయం కంటే అహింస, ధైర్యం ఎంతో గొప్పవి అనే ప్రాథమిక మంత్రాన్ని మహాత్ముడు మనకు ఇచ్చారని రాహుల్ చెప్పారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారత జాతిపితకు వినయపూర్వకమైన నివాళులర్పిస్తున్నానని రాహుల్ తన సోషల్ మీడియా సందేశంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కాక్ పిట్‌లో చివరి మాటలివే..
భారీ నష్టాల నుంచి లాభాల వైపు.. చివర్లో కోలుకున్న దేశీయ సూచీలు