Share News

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి, ఒకరి గల్లంతు..

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:52 PM

భారీ వర్షాలు మహారాష్ట్రను కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో పుణె జిల్లా మావల్ తహసీల్‌లోని పటాన్‌లో సోమవారం తెల్లవారుజామున 4:25 గంటలకు పలు ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు మృతిచెందగా, ఒకరు గల్లంతయ్యారు.

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి, ఒకరి గల్లంతు..
Pune Landslides

మహారాష్ట్ర: భారీ వర్షాలు మహారాష్ట్రను కుదిపేస్తున్నాయి. ముంబై, పుణె, థానే, రాయగడ్ ప్రాంతాలు వానలకు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలకు ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గల్లంతయ్యారు. ఎడతెరిపి లేని వానలతో పుణె జిల్లా మావల్ తహసీల్‌లోని పటాన్‌లో ఈరోజు తెల్లవారుజామున 4:25 గంటలకు పలు ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 30 నుంచి 35 మంది గ్రామస్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.


బాధితుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించగా, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను నందు టికోన్ (60), మౌలి టికోన్ (30), అనితా టికోన్ (55)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో వర్షాల కారణంగా ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఒక్క ముంబైలోనే 8 మంది వివిధ ఘటనల్లో మృతిచెందారు.

Pune2.jpg


మరోవైపు, ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. కొండచరియలు విరిగిపడ్డాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు. ఈ ఘటనతో ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, పాత ముంబై-పుణె హైవేపై భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని ఆయన వెల్లడించారు. సుమారు 100 టన్నుల శిథిలాలు ఒక్కసారిగా ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై పడ్డాయని పేర్కొన్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని.. ఇప్పటివరకు దాదాపు 70 శాతం శిథిలాలను తొలగించినట్లు సీఎం వివరించారు. పుణె నుంచి ముంబైకి వెళ్లే ట్రాఫిక్ కోసం ఒక లేన్‌ను తిరిగి తెరిచామని, రాబోయే కొన్ని గంటల్లో ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిస్థాయిలో పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.


ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబై-పుణె రహదారిపై ప్రమాదాలు పొంచి ఉన్నాయని అధికారులు తెలిపారు. అత్యవసర ప్రయాణాలు మినహా సాధారణ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై, థానే, రాయగడ్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికల ప్రకారం రానున్న గంటల్లో ముంబై సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సుమారు 15 వేల మంది సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్‌కు తీవ్ర గాయం.. ఆస్పత్రికి తరలింపు

ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..

Updated Date - Jul 06 , 2026 | 03:57 PM