స్కూళ్లకు 50 మీటర్ల పరిధిలో జంక్ ఫుడ్ అమ్మితే చర్యలు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
ABN , Publish Date - Nov 27 , 2026 | 09:11 PM
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలో జంక్ ఫుడ్ విక్రయాలు, ప్రకటనలపై నిషేధం విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలో జంక్ ఫుడ్ విక్రయాలు, ప్రకటనలపై నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఆహార విక్రయ కేంద్రాలపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కఠిన చర్యలు చేపట్టింది. 2026 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా 422 పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించింది (Maharashtra Junk Food Ban).
నిబంధనలు ఉల్లంఘించిన 79 జంక్ ఫుడ్‌స్టాల్స్‌ను సీజ్ చేసింది. మరో 21 కేంద్రాల లైసెన్సులను సస్పెండ్ చేసింది. పాఠశాలల పరిసరాల్లో పిల్లలకు అనారోగ్యకరమైన ఆహారం అందకుండా చూడటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ఎఫ్‌డీఏ జులై 28, 2026న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన ఆహార పదార్థాల విక్రయాలు, ప్రకటనలు, ఉచిత పంపిణీని పాఠశాలల్లో, వాటి ప్రవేశ ద్వారాల నుంచి 50 మీటర్ల పరిధిలో నిషేధించారు (No Junk Food Near Schools).
చిప్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, సమోసాలు, వడాపావ్ వంటి వేయించిన పదార్థాలు, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన ఇతర ఆహార పదార్థాలను స్కూళ్లకు 50 మీటర్ల పరిధిలో విక్రయించకూడదని నిషేధం విధించారు (Maharashtra FDA). ఈ నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు వివిధ విద్యా మండళ్లకు అనుబంధంగా ఉన్న విద్యాసంస్థలకు వర్తిస్తాయి. పాఠశాలల్లో క్యాంటీన్లు నిర్వహించే వారు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నుంచి రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ పొందాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
అది మీ బాధ్యత.. మదురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..
మూడేళ్లకు రూ.50 లక్షల కోట్లకు పైగా.. రష్యా చరిత్రలోనే భారీ రక్షణ బడ్జెట్..