Share News

తమిళనాడులోని జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ.. రూ.25 కోట్ల ఆభరణాలు మాయం!

ABN , Publish Date - Nov 12 , 2026 | 09:14 PM

తమిళనాడులోని మదురై నగరంలో భారీ నగల దోపిడీ కలకలం రేపింది. కలవాసల్ బైపాస్ రోడ్డులో ఉన్న ప్రముఖ తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు కోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ.. రూ.25 కోట్ల ఆభరణాలు మాయం!
Tanishq Jewellery Robbery

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని మదురై నగరంలో భారీ నగల దోపిడీ కలకలం రేపింది. కలవాసల్ బైపాస్ రోడ్డులో ఉన్న ప్రముఖ తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు కోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.

షోరూమ్‌లో ఉన్న సుమారు 16 కిలోల ఆభరణాలు చోరీకి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించగా, వాటి మార్కెట్ విలువ దాదాపు రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ షోరూమ్ ప్రారంభమై కేవలం పది రోజులు మాత్రమే అవుతోంది. ఇంకా అధికారిక ప్రారంభోత్సవం కూడా జరగకపోవడంతో ఇంటీరియర్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే దుండగులు ఇంత భారీ మొత్తంలో ఆభరణాలను దోచుకెళ్లడం స్థానికంగా సంచలనంగా మారింది.


నవంబర్ 10వ తేదీ రాత్రి షోరూమ్ సిబ్బంది ఎప్పటిలాగే దుకాణానికి తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే మరుసటి రోజు ఉదయం షోరూమ్‌కు చేరుకున్న సిబ్బందికి అక్కడి పరిస్థితి చూసి షాక్ తగిలింది. వెనుకవైపు తలుపులు ధ్వంసమై ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి పరిశీలించగా, బంగారం, వజ్రాభరణాలు భద్రపరిచిన పెట్టెలు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కొత్తగా ప్రారంభమైన షోరూమ్‌లో ఇంత భారీ మొత్తంలో ఆభరణాలు చోరీకి గురికావడం, దొంగలు రూ.25 కోట్ల విలువైన నగలను అపహరించుకెళ్లడం వ్యాపార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 12 , 2026 | 09:21 PM