సుప్రీంకోర్టే ఇలా చేస్తే ఎలా?
ABN , Publish Date - Jun 06 , 2026 | 06:07 AM
తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్, డీఎంకే నేత ఎం.అప్పావుకు సంబంధించిన 2016 ఎన్నికల వివాదం విషయంలో సుప్రీంకోర్టు తీరుపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది...
ఎన్నికల పిటిషన్లను సత్వరం పరిష్కరించాలనే తన తీర్పును తానే విస్మరించడమా?
ఆరేళ్లు పెండింగ్‌లో ఉంచుకుని మళ్లీ మా వద్దకా?
న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర పరిహాసానికి ఈ కేసే రుజువు
ఇలాగైతే భారత్ కూడా నిరంకుశ దేశాల సరసన
మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జయచంద్రన్ వ్యాఖ్యలు
పదేళ్ల తర్వాత ఓడిపోయిన నేతని విజేతగా ప్రకటన
చెన్నై, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్, డీఎంకే నేత ఎం.అప్పావుకు సంబంధించిన 2016 ఎన్నికల వివాదం విషయంలో సుప్రీంకోర్టు తీరుపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఆ కేసును ఆరేళ్లకు పైగా పెండింగ్‌లో ఉంచడమే కాకుండా, తిరిగి తమకే దానిని పంపించడం పట్ల ఘాటుగా స్పందించింది. పదేళ్ల క్రితం అప్పటి ఎన్నికల్లో ఓడిపోయినట్టు ఈసీ ప్రకటించిన అప్పావును విజేతగా ప్రకటించింది. ‘న్యాయవ్యవస్థ పట్ల తీవ్రమైన పరిహాసం’గా ఈ కేసును జస్టిస్ జి.జయచంద్రన్ అభివర్ణించారు. ఈ సందర్భంగా.. ఎన్నికల పిటిషన్ల పరిష్కారంలో జాప్యం చేయరాదంటూ మహమ్మద్ అక్బర్ వర్సెస్ అశోక్ సాహు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, ఆయన కటువైన వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయస్థానాలు తమ సొంత పరిశీలనల్నే విస్మరిస్తే ఎలా? ఇది ఇలాగే కొనసాగితే సుమారు 75 ఏళ్ల క్రితం మనతో పాటు స్వాతంత్య్రం పొందిన నిరంకుశ దేశాల సరసన భారత్ కూడా చేరిపోతుందేమోనని భయంగా ఉంది.’’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి జాప్యాలు ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీస్తాయన్నారు. 2016లో రాధాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అప్పావు.. అన్నాడీఎంకే అభ్యర్థి ఇన్బదురై చేతిలో 49ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. పోస్టల్ ఓట్లను ధ్రువీకరించే అధికారం ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు లేదంటూ కౌంటింగ్ సమయంలో ఎన్నికల అధికారి 203 పోస్టల్ ఓట్లను తిరస్కరించారు.
అందులో 153 ఓట్లు అప్పావుకు అనుకూలంగా పోలయ్యాయి. ఆ ఓట్లను తిరస్కరించకుండా ఉంటే తానే గెలిచేవాడినంటూ అప్పావు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్‌లను ధ్రువీకరించే అధికారం ఉందని నాటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ స్పష్టం చేశారు. రీకౌంటింగ్ జరపాలని 2019 అక్టోబరు 1న ఆదేశించారు. ఆ ఆదేశాలను అన్నాడీఎంకే నేత ఇన్బదురై సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. రీకౌంటింగ్ ఫలితాల ప్రకటనపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తరువాత పలు వాయిదాల అనంతరం... ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టు ముందుకు సాగేందుకు అనుమతిస్తూ గత నెల 26న సుప్రీంకోర్టు ఆ అప్పీలును పరిష్కరించింది. సుప్రీం ఆదేశాల మేరకు జస్టిస్ జయచంద్రన్ ఈ నెల 3న ఎన్నికల పిటిషన్‌ను అనుమతించారు. అప్పావు 103ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని ప్రకటించారు. ఎన్నికల పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో పదేళ్ల సుదీర్ఘ జాప్యం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్