Share News

సహజీవనానికి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:07 AM

మధ్యప్రదేశ్‌లో అమలుచేయబోయే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)కి సంబంధించి ఏర్పాటు చేసిన ముసాయిదా కమిటీ తన తుది నివేదికలో సహజీవన సంబంధాలపై పలు కీలక...

సహజీవనానికి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

  • మధ్యప్రదేశ్‌ యూసీసీ ముసాయిదాలో ప్రతిపాదనలు

భోపాల్‌, జూలై 15: మధ్యప్రదేశ్‌లో అమలుచేయబోయే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)కి సంబంధించి ఏర్పాటు చేసిన ముసాయిదా కమిటీ తన తుది నివేదికలో సహజీవన సంబంధాలపై పలు కీలక నిబంధనలను ప్రతిపాదించింది. వాటి ప్రకారం.. సహజీవన బంధంలోకి ప్రవేశించే జంటలు తమ నివాస పరిధిలోని జిల్లా రిజిస్ట్రార్‌ వద్ద తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బంధం ముగిసిపోతే దానిని అధికారికంగా రద్దు చేసుకోవాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే గరిష్ఠంగా మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ ముసాయిదా బిల్లును రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ ముసాయిదా ప్రకారం.. సహజీవన బంధంలోకి ప్రవేశించే జంటలు ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేయాలి. అలాగే ప్రతి పోలీ్‌సస్టేషన్‌లో లివ్‌-ఇన్‌ జంటల వివరాలను నమోదు చేసి నిర్వహించాల్సి ఉంటుంది. సహజీవన జంటల గురించిన సమాచారాన్ని పొరుగువారు లేదా ఇంటి యజమాని సమాచారం ఇవ్వడానికి కూడా ముసాయిదా అవకాశం కల్పించింది. అంతేకాకుండా భాగస్వామిని పురుషుడు విడిచిపెడితే మహిళకు భరణం చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదించింది. వారసత్వ చట్టాల్లో కూడా ముసాయిదా పలు మార్పులను సూచించింది. వాటి ప్రకారం.. మరణించిన వ్యక్తి ఆస్తిపై భార్య, పిల్లలు, తల్లితో పాటు తండ్రికి కూడా వారసత్వ హక్కులు దక్కుతాయి. ప్రస్తుతం వివాహం, విడాకులు, భరణం, వారసత్వ హక్కులు వంటి విషయాల్లో వేర్వేరు మతాలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయని, వీటి స్థానంలో ఒకే చట్టాన్ని తీసుకురావాలని కమిటీ అభిప్రాయపడింది. కాగా రాష్ట్రంలోని గిరిజనులకు ఈ తొలిదశ చట్టం వర్తించబోదని ముసాయిదాలో కమిటీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 06:07 AM