ఆమోదం ఖాయం!
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:03 AM
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు బిల్లు ఈసారి ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది.
లోక్‌సభలో డీలిమిటేషన్, మహిళా బిల్లు ఆమోదానికి రంగం సిద్ధం
మద్దతు ప్రకటించిన డీఎంకే, ఎన్‌సీపీ(ఎస్పీ).. అనుకూలంగా 355 మంది సభ్యులు!
358 మంది ఓటు వేస్తే నెగ్గనున్న బిల్లు.. ఆర్జేడీ, ఎస్పీ నుంచి కొందరు సభ్యుల గైర్హాజరు
కాంగ్రెస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందంటున్న బీజేపీ
డిసెంబరు 2న లోక్‌సభలో, 3న రాజ్యసభలో బిల్లుకు ఓటింగ్
14 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు?
న్యూఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు బిల్లు ఈసారి ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకోసం లోక్‌సభలో అవసరమైన మూడింట రెండో వంతు సభ్యుల మద్దతును అధికార పక్షం దాదాపుగా కూడగట్టింది. ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలకు తోడు డీఎంకే, ఎన్‌సీపీ (శరద్‌పవార్) కూడా డీలిమిటేషన్ బిల్లుకు తాము మద్దతిస్తామని ప్రకటించాయి. ఒకరిద్దరు సభ్యులు తక్కువ అయునా ఇబ్బంది కాకుండా.. ప్రతిపక్ష ఇండి కూటమిలోని పార్టీల నుంచి కొందరు సభ్యులు గైర్హాజరయ్యేలా, మరికొందరు క్రాస్ ఓటింగ్ చేసేలా అధికార పక్షం వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. దీంతో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ఇక లాంఛనమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబరు 2న లోక్‌సభలో, 3న రాజ్యసభలో ఆమోదం పొందుతుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 30న (సోమవారం) ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే.. ఇటీవల మరణించిన ఎంపీలకు సంతాప తీర్మానాలు, మంత్రుల పత్రాలు, జలవనరుల మంత్రిత్వ శాఖ స్థాయూ సంఘం నివేదికలను ప్రవేశపెడతారు. ఆ వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గతంలో వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ బిల్లు)లను ఉపసంహరించుకుంటారు. అనంతరం న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ 132వ రాజ్యాంగ సవరణ బిల్లు, అందుకు సంబంధించిన కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును ప్రవేశపెడతారు. ఆ వెంటనే వాటిపై చర్చ ప్రారంభమవుతుంది. ఈ మేరకు లోక్‌సభ శనివారం రాత్రి సభాకార్యకలాపాల జాబితాను విడుదల చేసింది.
355కు చేరిన ఎన్‌డీఏ బలం..
ప్రస్తుతం లోక్‌సభలోని 542 మంది సభ్యుల్లో ఇద్దరు మరణించడం, ఒకరు రాజీనామా చేయడంతోపాటు మరో ఇద్దరు జైల్లో ఉన్నారు. దీంతో మిగిలిన 537 ఎంపీల్లో 358 మంది ఓటు వేస్తే బిల్లులు నెగ్గనున్నాయి. కాగా, అధికార ఎన్డీఏ కూటమికి ఇప్పటికే 321 మంది సభ్యులున్నారు. వీరికితోడు 22 మంది సభ్యులున్న డీఎంకే, 8 మంది సభ్యులున్న ఎన్‌సీపీ (శరద్‌పవార్) కూడా మద్దతు ప్రకటించాయి. లోక్‌సభలో తమిళనాడు వాటా తగ్గకుండా చూడాలన్న తమ డిమాండ్ నెరవేరుతుండడంతో బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. శనివారం ఆ పార్టీ ఎంపీలతో సమావేశం అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా.. ఇండి కూటమికి గుడ్‌బై చెబుతున్నట్లు కూడా పరోక్షంగా పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభలో తమ సభ్యులకు స్థానాలను కాంగ్రెస్ సభ్యులకు దూరంగా కేటాయించాలంటూ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. దీంతో సోమవారమే వారి సీట్లను మారుస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎన్‌సీపీ (శరద్‌పవార్) మద్దతును ఆ పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. వీరికి తోడు వైసీపీకి చెందిన నలుగురు సభ్యులు కూడా మద్దతివ్వనున్నారు. దీంతో ఎన్‌డీఏ బలం 355కు చేరినట్లయింది. వీరు కాకుండా.. సమాజ్‌వాది పార్టీ, ఆర్జేడీ, జేఎంఎం, కాంగ్రె్‌సకు చెందిన పలువురు సభ్యులు గైర్హాజరు కావడమో, క్రాస్ ఓటింగ్ చేయడమో జరుగుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. కర్ణాటకలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని భావిస్తున్న ఆ రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెస్ ఎంపీలు ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ రీత్యా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌కు వీలు కల్పించే బిల్లుల ఆమోదానికి ఎటువంటి అడ్డంకులు లేవని తెలుస్తోంది.
30 అర్ధరాత్రి వరకు చర్చ..
డీలిమిటేషన్ బిల్లుపై లోక్‌సభలో సోమవారం అర్ధరాత్రి వరకు చర్చ జరుగుతుందని, మంగళవారం సాయంత్రం బిల్లు ఆమోదం పొందుతుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక రాజ్యసభలో మంగళ, బుధవారాల్లో బిల్లుపై చర్చ, ఆమోదం జరుగుతాయని అంటున్నాయి. అనంతరం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు బుధవారం వాయిదా పడి వర్షాకాల సమావేశాల ప్రొరోగ్ జరుగుతుందని, ఆ తర్వాత శీతాకాల సమావేశాలపై ప్రకటన వస్తుందని సమాచారం. సాధారణంగా ఒక సెషన్‌కు, మరో సెషన్‌కు మధ్య 15 రోజుల వ్యత్యాసం ఉంటుందని, అయితే స్పీకర్ ఆ వ్యత్యాసాన్ని ఒకటి రెండు రోజులు తగ్గించవచ్చునని అధికార వర్గాలు తెలిపాయి. ఈ రీత్యా డిసెంబరు 14 నుంచి నెలాఖరు వరకు శీతాకాల సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి.
ఐదుగురు తగ్గింది ఇందుకే..
లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 542 మంది సభ్యుల్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన నూర్-ఉల్-హసన్, మేఘాయలకు చెందిన రికీ ఆండ్రివ్ మరణించగా, జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆగా సయ్యద్ రుహుల్లా మెహ్ద రాజీనామా చేశారు. ఇక జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయిన పంజాబ్ ఎంపీ అమృత్‌పాల్ సింగ్, జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇంజనీర్ రషీద్‌లను సభకు హాజరై ఓటు వేసేందుకు స్పీకర్ అనుమతించలేదు. దీంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో ఐదు తగ్గింది. ఈ ఐదుగురు సభ్యులు పోగా.. మిగిలిన 537 ఎంపీల్లో 358 మంది ఓటు వేస్తే లోక్‌సభలో బిల్లులు నెగ్గుతాయి.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి