లద్దాఖ్‌కు కొత్తగా 5 జిల్లాలు.. కేంద్రం నోటిఫికేషన్‌కు ఎల్జీ ఆమోదం
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:34 PM
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నట్టు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారంనాడు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఎల్జీ ఆమోదం తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ (Ladakh)లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నట్టు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (Vinay Kuamr Saxena) సోమవారంనాడు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఎల్జీ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన ప్రకటించారు. ఇదొక చరిత్రాత్మకమైన రోజని, ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం లద్దాఖ్‌లో లెహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. కొత్తగా ఆమోదించిన ఐదు జిల్లాలతో వీటి సంఖ్య ఏడుకు చేరుకుంటుందని సక్సేనా తెలిపారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల పేర్లను నుబ్రా, షామ్, చాంగ్‌థాంగ్, జన్‌స్కర్, ద్రాస్‌గా ఆయన పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, వృద్ధి, ఉపాధికి కొత్త మార్గాలు ఏర్పడతాయని తెలిపారు. పాలనను నేరుగా ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లడంతో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ పరివర్తనాత్మక నిర్ణయానికి 2024 ఆగస్టులో హోం శాఖ ఆమోదం తెలిపిందని అన్నారు.
ఏరియా పరంగా లద్దాఖ్ అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం కాగా, జనాభా పరంగా చిన్నది. చైనా, పాకిస్థాన్‌తో 86,904 చదరపు కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 2.74 లక్షల జనాభా ఉన్నారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత 2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది. లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం నేరుగా కేంద్ర హోం శాఖ పాలనలో ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇప్పుడు వెళ్తున్నా.. మళ్లీ ఆరోజు తిరిగి వస్తా