Share News

స్టింగ్‌ ఆపరేషన్‌తో నాకు సంబంధం లేదు

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:11 AM

స్టింగ్‌ ఆపరేషన్‌తో తనకు సంబంధం లేదని కేంద్రమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు.

స్టింగ్‌ ఆపరేషన్‌తో నాకు సంబంధం లేదు
kumaraswamy

  • రితీశ్‌పాండే ఎవరో తెలియదు

  • కృపా ఆళ్వాను విదేశాలకు పంపింది ఎవరు? : కుమారస్వామి

  • ప్రజ్వల్‌ కేసులో ఏ2 కార్తీక్‌ డీకే శివకుమార్‌ను కలిశారు

  • ఆ తరువాతే అశ్లీల వీడియోలను విడుదల చేశారని ఆరోపణ

బెంగళూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): స్టింగ్‌ ఆపరేషన్‌తో తనకు సంబంధం లేదని కేంద్రమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. 2011లో జరిగిన స్టింగ్‌ ఆపరేషన్‌, 2023లో వీడియో చిత్రీకరణతో ఎలాంటి సంబంధం లేదన్నారు. సిద్దరామయ్యపై స్టింగ్‌ ఆపరేషన్‌కు వినియోగించిన మొబైల్‌ ఫోన్‌ ఢిల్లీలోని కేంద్రమంత్రి కుమారస్వామి నివాసంలోనే చేతులు మారిందని నగర పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌ కుమార్‌ సింగ్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. బెంగళూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ..స్టింగ్‌ ఆపరేషన్‌ కేసు విచారణ పారదర్శకంగా జరగడం లేదని, నిందితులకు క్లీన్‌చిట్‌ ఇచ్చే ఉద్దేశంతో దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. సీసీబీ ఇన్‌స్పెక్టర్‌ సతీశ్‌ను మార్చింది ఎవరని ప్రశ్నించారు. రితీశ్‌పాండే ఎవరో తనకు తెలియదని, ఢిల్లీలోని తన నివాసానికి వందలాదిమంది వస్తుంటారని, రితీశ్‌పాండే చిరునామా ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరాపుర ఘజియాబాద్‌ అని ఉందని పేర్కొన్నారు. నితీశ్‌ కుమార్‌ను పోలీసులు ఢిల్లీ నుంచి తీసుకొచ్చారని, ఎక్కడ అరెస్టు చేశారనే స్పష్టత లేదని తెలిపారు. డీకే శివకుమార్‌ సీడీ ద్వారా బ్లాక్‌మెయిల్‌ చేశారని ఆరోపించారు. తన ఇంటికి వచ్చి పోలీసులు సోదాలు చేసుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.


స్టింగ్‌ ఆపరేషన్‌లో ఉన్న కృపా ఆళ్వాను విదేశాలకు పంపింది ఎవరని, సిద్దరామయ్యకు క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకే దర్యాప్తు జరిపారా..., ఇటీవల విడుదలైన వీడియోలో ఉన్న మూడో వ్యక్తి ఎవరు అని ప్రశ్నించారు. అలాగే పోలీస్‌ కమిషనర్‌ హడావుడిగా ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారని, దర్యాప్తు దశలో ఉన్న వివాదాస్పద అంశాన్ని బహిర్గతం చేయరాదనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నగర పోలీస్‌ కమిషనర్‌ ఉల్లంఘించినట్లు కాదా? అని ప్రశ్నించారు. కాగా, ప్రజ్వల్‌ రేవణ్ణ అశ్లీల వీడియోల పెన్‌డ్రైవ్‌లు బయటికి రావడం వెనుక కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం సూచనలు ఉన్నాయని కుమారస్వామి ఆరోపించారు. ఆ కేసులో ఏ2 నిందితుడు, ప్రజ్వల్‌ కారు డ్రైవర్‌ కార్తీక్‌ ఆ వీడియోలను బయట పంచేందుకు ముందు అప్పటి డీసీఎం డీకే శివకుమార్‌కు ఇచ్చారని పేర్కొన్నారు. తమ కుటుంబంపై కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కుట్ర చేసిందని ఆరోపించారు. సదాశివనగర్‌లోని నివాసంలో డీకే శివకుమార్‌ను డ్రైవర్‌ కార్తీక్‌ కలిశారని, 2023, ఆగస్టు 5, 6 తేదీలలో కలిసినట్లు సీడీఆర్‌లో ఉందని పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి

Updated Date - Nov 03 , 2026 | 07:11 AM