కుకీ మహిళా నేతకు డిప్యూటీ సీఎం..
ABN , Publish Date - Feb 03 , 2026 | 09:01 PM
మణిపూర్‌లోని కాంగ్పోక్పి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అయిన కిప్‌గేన్ గత ప్రభుత్వంలో వాణిజ్యం-పరిశ్రమలు, టెక్స్‌టైల్స్, సాంఘిక సంక్షేమ శాఖలతో సహా పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.
ఇంఫాల్: మణిపూర్(Manipur)లో బీజేపీ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. కుకీ నేత నేమ్చా కిప్‌గేన్ (Nemcha Kipgen) ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కాంగ్పోక్పి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అయిన కిప్‌గేన్ గత బీరేన్ సింగ్ ప్రభుత్వంలో వాణిజ్యం-పరిశ్రమలు, టెక్స్‌టైల్స్, సాంఘిక సంక్షేమ శాఖలతో సహా పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో బీరేన్ సింగ్ ప్రభుత్వం 2025 ఫిబ్రవరి 9న రాజీనామా చేసింది. అప్పటి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. పరిస్థితులు కుదుటపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ కేంద్ర అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. మణిపూర్ బీజేపీ శాసనసభా పక్ష నేతగా పార్టీ సీనియర్ నేత ఖేమ్‌చంద్ సింగ్ మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
ఎవరీ నేమ్చా కిప్‌గేన్?
నేమ్చా కిప్‌గేన్ 2012 నుంచి కాంగ్పోక్పి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీరేన్ సింగ్ తొలి ప్రభుత్వంలో (2017-2025) సాంఘిక సంక్షేమం-సహకారం శాఖను నిర్వహించారు. బీరేన్ సింగ్ రెండోసారి ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్యం, టెక్స్‌టైల్స్ శాఖలను చేపట్టారు. మణిపూర్‌లోని గిరిజన కుకీ కమ్యూనిటీకి చెందిన కిప్‌గేన్ తన నియోజకవర్గంలో కమ్యూనిటీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతోపాటు యువత సాధికారతకు కృషి చేసిన నేతగా పేరు తెచ్చుకున్నారు. కుకీ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎస్‌టీ థంగబోయీ కిప్‌గేన్‌ను వివాహమాడారు.
ఇవి కూడా చదవండి..
మణిపూర్ సీఎంగా పగ్గాలు చేపట్టనున్న ఖేమ్‌చంద్ సింగ్
140 కోట్ల భారతీయులకు మేలు చేసే డీల్.. యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్