Share News

రీల్స్ కోసం యువకుడిపై దారుణం.. పెట్రోల్ తాగించి నిప్పంటించిన దుండగులు..

ABN , Publish Date - Nov 06 , 2026 | 07:12 PM

సోషల్ మీడియా రీల్స్ పిచ్చి ఎంతటి దారుణాలకు దారితీస్తుందో చెప్పడానికి కోల్‌కతాలో జరిగిన తాజా ఘటన ఓ నిదర్శనంగా నిలుస్తోంది.

రీల్స్ కోసం యువకుడిపై దారుణం.. పెట్రోల్ తాగించి నిప్పంటించిన దుండగులు..
Kolkata Crime News

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా రీల్స్ పిచ్చి ఎంతటి దారుణాలకు దారితీస్తుందో చెప్పడానికి కోల్‌కతాలో జరిగిన తాజా ఘటన ఓ నిదర్శనంగా నిలుస్తోంది. రీల్ చేయాలనే ఉద్దేశంతో ఓ యువకుడి కళ్లకు గంతలు కట్టి, హెల్మెట్ పెట్టి, పెట్రోల్ తాగించేందుకు ప్రయత్నించడమే కాకుండా.. అతడి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఈ ఘటన మొత్తాన్ని రికార్డ్ చేశారు (Kolkata Teen Set on Fire).


ఈ ఘటన అక్టోబర్ 27న దక్షిణ కోల్‌కతాలోని గర్ఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లెనిన్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధిత యువకుడు పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా కొందరు అతడిని అడ్డుకున్నారు. ఆట ఆడదామని నమ్మించి సమీపంలోని ఓ చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అతడి తలపై హెల్మెట్ పెట్టి, కళ్లకు గంతలు కట్టారు. అనంతరం అతడిని కొట్టారు. బాధితుడు హెల్మెట్ తీసేందుకు ప్రయత్నించడంతో నిందితులు మరింత దారుణంగా ప్రవర్తించారు. అతడికి పెట్రోల్ తాగించేందుకు ప్రయత్నించారు. అయితే పెట్రోల్ వాసన గుర్తించిన యువకుడు దానిని చేతితో పక్కకు నెట్టేశాడు (Social Media Reel Crime).


ఆగ్రహించిన నిందితులు అతడి శరీరంపై పెట్రోల్ పోసి, అగ్గిపుల్ల వెలిగించి అతడిపై విసిరారు (Viral Reel News). దీంతో యువకుడి దుస్తులకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాధితుడు ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశాడు. తన ఒంటిపై మండుతున్న దుస్తులను తొలగించుకున్నాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అతడి ఛాతీ, పొట్ట భాగాల్లో కాలిన గాయాలయ్యాయి. నిందితుల్లో ఒకరు ఈ దాడి మొత్తాన్ని మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో రీల్‌గా ప్రచురించాలనే ఉద్దేశంతోనే ఈ ఘటనను రికార్డు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

కొనసాగుతున్న లాభాలు.. 1,200 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..


ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..

Updated Date - Nov 06 , 2026 | 07:42 PM