Share News

రాష్ట్రంలో హింసా రాజకీయాలకు స్థానం లేదు

ABN , Publish Date - May 28 , 2026 | 06:27 AM

తెలంగాణలో హింసా రాజకీయాలకు స్థానం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని బహిరంగంగా పిలుపునివ్వడం చట్ట వ్యతిరేక చర్య ...

రాష్ట్రంలో హింసా రాజకీయాలకు స్థానం లేదు

  • ఆస్తుల విధ్వంసానికి పిలుపునివ్వడం చట్ట వ్యతిరేకం

  • సమాజాన్ని అశాంతి వైపు నెట్టేందుకు బీఆర్‌ఎస్‌ కుట్ర

  • బాల్క సుమన్‌ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

న్యూఢిల్లీ, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో హింసా రాజకీయాలకు స్థానం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని బహిరంగంగా పిలుపునివ్వడం చట్ట వ్యతిరేక చర్య అని, ప్రజల కష్టంతో నిర్మించిన సింగరేణి వంటి సంస్థలను కాలబెట్టాలని సూచించడం.. తెలంగాణను అగౌరవపర్చడమేనని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దాడి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిలిటెంట్‌ యాక్టివిటీ చేయాలంటూ బీఆర్‌ఎస్‌ నాయకుడు చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవని.. బాల్క సుమన్‌ను ఉద్దేశించి ఒక ప్రకటనలో మండిపడ్డారు. సదరు వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. యువతను రెచ్చగొట్టడం ద్వారా సమాజాన్ని అశాంతి వైపు నెట్టే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఈ ఘటన.. బీఆర్‌ఎస్‌ రాజకీయ స్వభావాన్ని బయటపెట్టిందని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎ్‌సలో అసహనం పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. సమాజంలో భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. బాధ్యతారహితంగా వ్యవహరించే నాయకులను, సమాజంలో అశాంతి సృష్టించే పార్టీలను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో శాంతి, అభివృద్ధి, బాధ్యతాయుత రాజకీయాల కోసం బీజేపీ నిబద్ధతతో పని చేస్తోందని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ కూడా బీఆర్‌ఎస్‌ మాదిరే రెచ్చగొట్టే రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిందని ఆరోపించారు.


కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అనేక సందర్భాల్లో ప్రధాని మోదీ పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల అవమానకరంగా మాట్లాడారని గుర్తు చేశారు. విదేశాల్లోనూ రాహుల్‌గాంధీ భారత వ్యతిరేక ప్రసంగాలు చేశారని, మణిపూర్‌కు వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అధికారంలో ఉన్నన్ని రోజులు దేశంలో మతపరమైన అల్లర్లకు కారణమైన కాంగ్రెస్‌.. ఇప్పుడు ప్రజలు సామరస్యంగా వ్యవహరిస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. కాగా, సింగరేణి కార్యాలయాలను తగులబెట్టాలని పిలుపునివ్వడానికి బాల్క సుమన్‌కు సిగ్గుందా? అని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌ నిలదీశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆరే ఇలాంటి హింసను ప్రోత్సహించే వ్యాఖ్యలు చేయమన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు హింసను భరించరని, ఇప్పటికైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని హితవు పలికారు.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 06:27 AM