Share News

కేతన్ అగర్వాల్ హత్య కేసు.. విచారణలో సంచలన విషయాలు..

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:29 PM

పుణెలోని లోహగడ్ కోట వద్ద జూన్ 18న వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

కేతన్ అగర్వాల్ హత్య కేసు.. విచారణలో సంచలన విషయాలు..

మహారాష్ట్ర: పుణెలోని లోహగడ్ కోట వద్ద జూన్ 18న వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. కాబోయే భార్య, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి కేతన్‌ను లోయలోకి తోసి హత్య చేశారు. అయితే, ఈ కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధరి కలిసి కేతన్‌ను హత్య చేసేందుకు ముందుగానే పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులిద్దరూ హత్యను ఎలా చేయాలనే అంశాలపై గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.


హత్యకు ముందు లోహగడ్ కోటకు వెళ్లి తమ ప్రణాళికను అమలు చేయడంపై రిహార్సల్ కూడా చేసినట్లు వెల్లడైంది. పొరపాటున పోలీసులకు చిక్కితే తప్పించుకునేందుకు సమాధానాలు ఎలా చెప్పాలన్న దానిపైనా ప్రాక్టీస్ చేసినట్లు తేలింది. హత్య సమయంలో గుర్తుపట్టకుండా ఉండేందుకు మారువేషంలో వెళ్లాలనే ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారని విచారణలో బయటపడింది. మరోవైపు, హత్యకు ముందు, తర్వాత తమ మొబైల్ ఫోన్లలోని చాట్ హిస్టరీతో పాటు రీసైకిల్ బిన్‌లోని డేటానూ పూర్తిగా తొలగించినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి, డిలీట్ చేసిన సమాచారాన్ని పోలీసులు రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.


అలాగే జూన్ 14న కేతన్‌ను హత్య చేయాలనుకున్న వారి ప్లాన్ విఫలయత్నంగా మారింది. ఆ రోజు కేతన్‌ను కొండ పైనుంచి సియా తోసేసింది. జూన్ 18న కూడా ప్రయత్నం విఫలమైతే ఏం చేయాలనే దానిపైనా నిందితులిద్దరూ 'ప్లాన్-సి'ని సిద్ధం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు, నేడు (ఆదివారం) ఘటనా స్థలంలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పుణె గ్రామీణ పోలీసులు సియా, చేతన్‌లను లోహగడ్ కోటకు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ ప్రారంభించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఒకే విమానంలో ఫడణవీస్, ఉద్ధవ్ ఠాక్రే.. ఏక్‌నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు..

వెనెజువెలా భూకంపాలు.. కుమార్తెను కాపాడుతూ ఫుట్‌బాల్ ఆటగాడి భార్య మృతి..

Updated Date - Jun 28 , 2026 | 01:21 PM