Kerala: నీలా నది తీరంలో కేరళ కుంభమేళా.. 270 ఏళ్ల తర్వాత..
ABN , Publish Date - Jan 20 , 2026 | 08:55 AM
కేరళలో సుమారు 270 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన ‘కేరళ కుంభమేళా(మహామాఘ మహోత్సవం)’ ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.
తిరూర్: కేరళలోని నీలా నది(భారతపుళ) తీరంలో కేరళ కుంభమేళాగా చెప్పకునే ‘మహామాఘ మహోత్సవం’ మలప్పురం జిల్లా తిరునవయలో ప్రారంభమైంది. ఈ కుంభమేళాను కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్.. ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ‘మహామాఘ మహోత్సవం’లో మొదటి స్నానం నవముకుంద ఆలయ స్నాన ఘాట్‌లో మాహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి మహారాజ్ నేతృత్వంలో జరిగింది. 270 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఉత్సవాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించడం విశేషం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. కేరళ కుంభమేళా 1755లో జరిగినట్లు సమాచారం.
ఫిబ్రవరి 3 వరకు కేరళ కుంభమేళా కొనసాగుతుంది. ఈ ఉత్సవానికి కేరళ, తమిళనాడు సహా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రోజుకు దాదాపు 50 వేల మందికి పైగా భక్తులు నీలా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు విచ్చేస్తుంటారు. ప్రతిరోజూ కాశీ పండితుల ఆధ్వర్యంలో సాయంత్రం నీలా హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం కేరళ ఆర్టీసీ.. 100 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అంతేకాకుండా.. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యోగా, కలరిపయట్టుతో పాటు కొన్ని సాంస్కృతిక ప్రదర్శనలూ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..
ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి