వందేమాతరం పాడకుండానే.. కేరళలో స్వాతంత్య్ర దిన వేడుకలు
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:40 AM
వందేమాతరం గేయం ఆలపించడాన్ని కేరళ సర్కారు పరోక్షంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం తన ఉద్దేశాన్ని స్వాతంత్య్ర దినోత్సవంలో బహిర్గతం చేసింది...
తిరువనంతపురం, ఆగస్టు 15: వందేమాతరం గేయం ఆలపించడాన్ని కేరళ సర్కారు పరోక్షంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం తన ఉద్దేశాన్ని స్వాతంత్య్ర దినోత్సవంలో బహిర్గతం చేసింది. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఆ గేయాన్ని పాడకపోవడంతో వివాదం రేగింది. వందేమాతరంపై తమకు స్పష్టమైన వైఖరి ఉందని, అది పంద్రాగస్టు వేడుకల్లో స్పష్టమవుతుందని గతంలో సీఎం సతీశన్ చెప్పినట్లుగానే వందేమాతరం గేయాన్ని విస్మరించడంతో రాజకీయంగా కాకపుట్టించింది. ప్రభుత్వ చర్యపై బీజేపీ మండిపడింది. ఒత్తిడికి ప్రభుత్వ నేతలు లొంగిపోయారంటూ విమర్శలు గుప్పించింది. ఇక హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా వందేమాతరం పూర్తిగా పాడాలని ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా ఆ ప్రస్తావన లేకుండానే స్వాతంత్య్ర దిన వేడుకల నిర్వహణపై విద్యా శాఖ డైరెక్టర్ జనరల్ ఈనెల 11న స్కూళ్లకు ఆదేశాలు జారీ చేయడం, అలాగే జీఏడీ (ప్రొటోకాల్) శాఖ జారీ చేసిన వేడుకల నిర్వహణ ఉత్తర్వుల్లో కూడా వందేమాతరం పాడాలని చెప్పకపోవడం యూడీఎఫ్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. శనివారం తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాలకు ముఖ్యమంత్రి వీడీ సతీశన్ హాజరయ్యారు. త్రివర్ణ పతాకాన్ని ఎగువేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. వందేమాతరం వివాదాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు, లౌకికవాదం, సమానత్వం అంశాల గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వ ఉద్దేశాన్ని పరోక్షంగా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News