తిరుపరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం.. మాజీ న్యాయమూర్తుల పర్యవేక్షణలో వేడుక..
ABN , Publish Date - Nov 28 , 2026 | 06:36 PM
తమిళనాడులోని మదురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొండపై ఉన్న దీపతూన్ (రాతి స్తంభం) వద్ద శనివారం సాయంత్రం 5 గంటలకు దీపాన్ని వెలిగించారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని మదురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొండపై ఉన్న దీపతూన్ (రాతి స్తంభం) వద్ద శనివారం సాయంత్రం 5 గంటలకు దీపాన్ని వెలిగించారు. సుప్రీంకోర్టు నియమించిన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుక కోసం కొండపై భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు (సీఆర్‌పీఎఫ్) భద్రతా బాధ్యతలు చేపట్టాయి (Karthigai Deepam 2026).
ఈ వేడుకను చూసేందుకు సాధారణ భక్తులకు కొండపైకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. అధికారికంగా అనుమతి పొందిన 50 మంది భక్తులకు మాత్రమే దీపం వెలిగించే కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం కల్పించారు. నవంబరు 24న జరిగిన కార్తీక దీపోత్సవం సందర్భంగా ఉచ్చి పిళ్లయార్ ఆలయం సమీపంలోనే మహాదీపాన్ని వెలిగించారు. దీపతూన్ వద్ద కూడా దీపం వెలిగించాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదన్న అంశం వివాదానికి దారితీసింది. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. నవంబర్ 27న తమిళనాడు ప్రభుత్వానికి ధిక్కార నోటీసులు జారీ చేసింది (Thiruparankundram Hill).
గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా, బహిరంగంగా ఉల్లంఘించారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది (Madurai Deepam Row). నవంబర్ 28న దీపతూన్ వద్ద దీపం వెలిగించాలని మరోసారి ఆదేశించింది. ఆలయ పాలక మండలిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీపం వెలిగించే కార్యక్రమం పర్యవేక్షణ కోసం మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు శనివారం ఉదయం చెన్నై నుంచి మదురై చేరుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం దీపం వెలిగించేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు.
ఇవి కూడా చదవండి..
మహిళా రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు.. ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు..
ఇది దక్షిణాది రాష్ట్రాల విజయం.. డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ కీలక ప్రకటన..