చెరకు రైతుల ఆందోళనలు.. ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం డీకే శివకుమార్ లేఖ
ABN , Publish Date - Oct 19 , 2026 | 03:40 PM
ఉత్తర కర్ణాటకలో చెరకు రైతుల ఆందోళనలతో చక్కెర మిల్లుల్లో పని నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం జోక్యాన్ని కోరింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం డీకే శివకుమార్ లేఖ రాశారు.
బెంగళూరు, అక్టోబర్ 18: ఉత్తర కర్ణాటకలో చెరకు రైతుల ఆందోళనల కారణంగా చక్కెర మిల్లుల్లో చెరకు క్రషింగ్ నిలిచిపోవడంతో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసాన్ని ముట్టడించేందుకు రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రలు, రహదారుల దిగ్బంధనాల వల్ల ప్రజాజీవితం తీవ్రంగా ప్రభావితమవుతోందని, చెరకు పంట చేతికొచ్చి పొలాల్లోనే పాడైపోతోందని సీఎం లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి లేఖలోని ప్రధానాంశాలు:
1. చక్కెర మద్దతు ధర (MSP) పెంపు
2019 ఫిబ్రవరి నుంచి చక్కెర కనీస మద్దతు ధర కిలోకు రూ.31 గానే ఉంది. కానీ, చెరకు మద్దతు ధర టన్నుకు రూ.2,750 నుంచి రూ.3,650కి పెరిగింది. పాత చక్కెర ధరల వద్ద మిల్లులు రైతులకు సరైన గిట్టుబాటు ధరను చెల్లించలేకపోతున్నందున వెంటనే ఎంఎస్‌పీని సవరించాలని కోరారు.
2. దేశీయ, వాణిజ్య అవసరాలకు వేర్వేరు ధరలు
సాధారణ గృహ వినియోగదారులకు భారం పడకుండా ఉంటూనే.. బల్క్ కమర్షియల్ కొనుగోలుదారుల నుంచి సరైన ధర రాబట్టేలా చక్కెర ధరల వర్గీకరణ చేయాలని సూచించారు.
3. ఇథనాల్ సేకరణ టెండర్ విధానం సమీక్ష
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(OMCs) ఇటీవల విడుదల చేసిన టెండర్లలో చెరకు రసం, షుగర్ సిరప్ ద్వారా తయారు చేసే ఇథనాల్‌ను మినహాయించడం సరికాదని పేర్కొన్నారు. ఇది మిల్లుల ఆదాయాన్ని దెబ్బతీసి, రైతులకు చెల్లింపులు నిలిచిపోయేలా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
4. చెరకు ఆధారిత ఇథనాల్ ధరల పెంపు
ఎఫ్ఆర్‌పీ నిరంతరం పెరుగుతున్నప్పటికీ, చెరకు రసం ద్వారా తయారు చేసే ఇథనాల్ ధరలు 2022-23 నుంచి పెరగలేదని, ధాన్య ఆధారిత ఇథనాల్ ధరలను పెంచినట్లే వీటిని కూడా పెంచాలని కోరారు.
5. ఎఫ్‌ఆర్‌పీ రికవరీ బేస్ 9.50శాతానికి తగ్గింపు
చక్కెర రికవరీ బేస్‌ను 10.25 శాతానికి పెంచడం వల్ల తక్కువ రికవరీ ఉండే ప్రాంతాల రైతులకు పూర్తి ఎఫ్‌ఆర్‌పీ అందడం లేదని, పాత పద్ధతి ప్రకారం.. దీనిని తిరిగి 9.50 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు
రాష్ట్ర పరిధిలోని అధికారాలను ఉపయోగించి ఇప్పటికే చక్కెర మిల్లుల డిజిటల్ వేయింగ్ సిస్టమ్, ల్యాబ్ అక్రిడిటేషన్లు, టన్నుకు అదనంగా రూ.100 చొప్పున(ఇందులో రూ.50 రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ) రైతులకు రూ.290 కోట్లు విడుదల చేసినట్లు లేఖలో స్పష్టం చేశారు. అయితే, రైతుల ప్రధాన డిమాండ్లు కేంద్ర పరిధిలోనే ఉన్నందున ప్రధాని మోదీ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. (Karnataka Sugarcane Farmers Protest)



Also Read:
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో
ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్‌ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే..