కర్ణాటక శివమొగ్గ జిల్లాలో విషాదం.. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి..
ABN , Publish Date - Aug 02 , 2026 | 03:28 PM
కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా ఇందిరానగర్‌లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇవాళ (ఆదివారం) ఓ కుటుంబం బలైంది. ఈరోజు తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటక: భారీ వర్షాలకు శివమొగ్గ జిల్లా ఇందిరానగర్‌లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఇవాళ (ఆదివారం) ఓ కుటుంబం బలైంది. ఈరోజు తెల్లవారుజామున కురిసిన వర్షానికి కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో మూడేళ్ల చిన్నారి ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
కొప్పల్ జిల్లా గంగావతి తాలుకా కొక్కరెగర గ్రామానికి చెందిన మల్లికార్జున్ (35) తన భార్య నాగవేణి (28), కుమారుడు సంతోశ్(3)తో కలిసి ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే, వారంతా నిద్రిస్తుండగా భారీ వర్షాలకు ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. సరిగ్గా వారు నివాసం ఉంటున్న రేకుల షెడ్డుపై పడటంతో నిద్రలోనే వారంతా కన్నుమూశారు. మరోవైపు, పక్కనున్న షెడ్డుపైనా మట్టి, రాళ్లు వచ్చి పడటంతో అందులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సేవల విభాగం, అగ్నిమాపక బృంద సభ్యులు రంగంలోకి దిగారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన బాధితుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మల్నాడు ప్రాంతంలో ఎడతెరిపి లేని భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మాజీ ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించిన బీఎస్పీ చీఫ్ మాయావతి
జులైలో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..