‘నా యవ్వనం గురించి పగటి కలలు కనకండి’.. రామ్‌దేవ్‌కు కంగనా రనౌత్ స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:01 PM
యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనకు వ్యక్తిత్వం గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: జెన్ జీపై చేసిన వ్యాఖ్యల విషయంలో నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురువు బాబా రామ్‌దేవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన వ్యాఖ్యలను విమర్శించిన రామ్‌దేవ్‌కు కంగనా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితం, యవ్వనం గురించి వ్యాఖ్యానించడం సరికాదని స్పష్టం చేశారు.
‘నా వ్యక్తిగత జీవితం గురించి ఊహించొద్దు’
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రామ్‌దేవ్‌ను ఉద్దేశిస్తూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన యవ్వనం, వ్యక్తిగత జీవితం గురించి ఊహాగానాలు చేయొద్దని సూచించారు. పుకార్ల ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని పేర్కొన్నారు. తనకు వ్యక్తిత్వం గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని 'నాది మీ కంటే మంచి క్యారెక్టర్ అంటూ' రామ్‌దేవ్‌పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా పతంజలి సంస్థకు సంబంధించిన గత వివాదాలను కూడా ఆమె ప్రస్తావించారు.
అసలు వివాదం ఎలా మొదలైంది?
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షకు సంబంధించిన అంశంపై జరిగిన నిరసనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంగనా వాటిపై స్పందించారు. నిరసనల్లో పాల్గొన్న కొందరు యువత ప్రవర్తనను ఆమె తీవ్రంగా విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువతలోని ఒక వర్గం స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తోందని, బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
కంగనాపై రామ్‌దేవ్ విమర్శలు
కంగనా వ్యాఖ్యలపై బాబా రామ్‌దేవ్ కూడా స్పందించారు. యువతను అవమానించేలా ‘జనరేషన్ గట్టర్’ వంటి పదాలను ఉపయోగించడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కంగనా.. గతంలో ఎలా ఉండేవారని, ఆమె యవ్వనం ఎలా సాగిందని రామ్‌దేవ్ ప్రశ్నలు లేవనెత్తినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రామ్‌దేవ్ వ్యాఖ్యలకు కంగనా తాజాగా ఘాటుగా స్పందించారు.

పతంజలి కేసును ప్రస్తావించిన కంగనా
తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన రామ్‌దేవ్‌కు సమాధానంగా కంగనా పతంజలి సంస్థకు సంబంధించిన సుప్రీంకోర్టు కేసును ప్రస్తావించారు. 2024లో పతంజలి సంస్థ వ్యాధులను నయం చేస్తామని ప్రచారం చేసిన ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు బాబా రామ్‌దేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అనంతరం రామ్‌దేవ్ కోర్టుకు బేషరతు క్షమాపణలు తెలిపారు. ఈ అంశాన్నే ప్రస్తావిస్తూ.. తనపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని కంగనా సూచించారు. దీంతో కంగనా–రామ్‌దేవ్ మధ్య మాటల యుద్ధం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read:
పరీక్షల వ్యవస్థపై అవగాహన ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి.. జగన్‌కు లోకేశ్ సవాల్
వన్ వేపై సర్‌ప్రైజ్ చెక్.. సామాన్యుడిలా బైక్‌పై కేబీఆర్‌కు సీపీ సజ్జనార్