జస్టిస్ వర్మ నేరస్థుడే!
ABN , Publish Date - Aug 13 , 2026 | 05:41 AM
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్‌రూంలో భారీ ఎత్తున డబ్బు దొరికిన మాట వాస్తవమేనని, ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై...
ఆయన మీద వచ్చిన అన్ని ఆరోపణలూ రుజువయ్యాయి
నోట్లకట్టలు ఎలా వచ్చాయన్నదానిపై న్యాయమూర్తి సరైన
జవాబివ్వలేదు.. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే యత్నం
జస్టిస్ వర్మ వివరణ తప్పించుకునే విధంగా ఉంది
త్రిసభ్య కమిటీ నిర్ధారణ.. పార్లమెంటుకు నివేదిక సమర్పణ
శీతాకాల సమావేశాల్లో జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ?
న్యూఢిల్లీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్‌రూంలో భారీ ఎత్తున డబ్బు దొరికిన మాట వాస్తవమేనని, ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై ఆయన ఇచ్చిన వివరణ తప్పించుకునే విధంగా ఉందని లోక్‌సభ స్పీకర్ నియమించిన త్రిసభ్య కమిటీ తెలిపింది.
జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలను రుజువైనట్లుగానే భావించవచ్చునని, ఈ మేరకు తమకు తగిన సాక్ష్యాధారాలు లభించాయని పేర్కొంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య సభ్యులుగా ఉన్న కమిటీ తన నివేదికను బుధవారం పార్లమెంట్ ఉభయ సభలకు సమర్పించింది. జస్టిస్ వర్మపై నమోదైన మూడు ఆరోపణలు రుజువయ్యాయని ఈ నివేదికలో దర్యాప్తు కమిటీ స్పష్టం చేసింది. మొదటి ఆరోపణ ప్రకారం.. తన నివాసంలో దొరికిన నోట్ల కట్టలు ఎవరివి? ఎక్కడి నుంచి వచ్చాయి? అన్న ప్రశ్నలకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వటంలో జస్టిస్ వర్మ విఫలమయ్యారని, కాబట్టి, ఆ ఆరోపణ రుజువైందని పేర్కొంది. నోట్లకట్టలు బయటపడిన ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను భద్రపర్చలేదని, సంబంధిత అధికారులు తనిఖీ చేసి సీల్ చేయటానికి ముందే స్టోర్‌రూంలో ఉన్న వస్తువులను చిందరవందర చేసి ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారన్నది రెండో ఆరోపణ. ఇది కూడా రుజువైందని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. మూడో ఆరోపణ.. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బాధ్యతగా, పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించాల్సిన న్యాయమూర్తి వైఖరి ఆ విధంగా లేదన్నది కూడా రుజువైందని కమిటీ తెలిపింది. ఘటన జరిగిన తర్వాత కరెన్సీ నోట్లు మాయం కావటం వెనుక కారణాలను కూడా జడ్జి వెల్లడించలేదని, సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేలా స్టోర్‌రూంను శుభ్రం చేయించారని వెల్లడించింది. సాక్షులు సమర్పించిన ఆధారాలతో ప్రశ్నించినప్పుడు జస్టిస్ వర్మ తప్పించుకునే విధంగా, అసంతృప్తికరంగా సమాధానాలిచ్చారని పేర్కొంది. అంతేగాక, క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావటానికి జస్టిస్ వర్మ ముందుకు రాలేదని గుర్తు చేసింది. వీటన్నింటి రీత్యా అతడిపై వచ్చిన ఆరోపణలు అన్నీ రుజువైనట్లుగా భావిస్తున్నామని కమిటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు రెండు సంపుటాల్లో నివేదికను స్పీకర్‌కు సమర్పించింది.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News