నిరాహార దీక్షను విరమించిన ఝార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో..
ABN , Publish Date - Aug 18 , 2026 | 07:22 AM
జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షను ఝార్ఖండ్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని వారాలుగా చేస్తున్న నిరాహార దీక్షను ఝార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో విరమించారు. మహతోతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై స్పష్టమైన హామీ ఇవ్వడంతో దీక్షను విరమిస్తున్నట్లు మహతో ప్రకటించారు.
రాంచీ: ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జేఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షలను ఝార్ఖండ్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారాల తరబడి విద్యార్థులు నిరసన తెలపడంతో సోమవారం రాత్రి పరీక్షను రద్దు చేస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొన్ని వారాలుగా చేస్తున్న నిరాహార దీక్షను ఝార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో విరమించారు. రాంచీలోని సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహతోతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వారి స్పష్టమైన హామీ మేరకు తాను నిరశన దీక్షను విరమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జేఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షలో అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ముఠాల వెనుక ఉన్న అసలైన సూత్రధారులను పట్టుకోవడానికి ప్రభుత్వం, అధికారులు సమష్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలు, ఇతర అవకతవకలను నివారించే వ్యవస్థను తాము కోరుకుంటున్నామని నొక్కి చెప్పారు. ‘నా జీవితంలో సీబీఐ లేదా సీఐడీ దర్యాప్తులకు ఆదేశించి, ఆ తర్వాత రద్దు చేసిన సందర్భాలను ఎన్నో చూశాను. ప్రశ్నపత్రాల లీకులు, అవకతవకలు మళ్లీ ఎప్పటికీ జరగవని ప్రభుత్వం హామీ ఇచ్చే వ్యవస్థ మనకు కావాలి’ అని మహతో పేర్కొన్నారు. అలాగే పరీక్షా వ్యవస్థ నుంచి అవినీతిని తొలగించే ప్రయత్నాలకు విద్యార్థులు మద్దతు కొనసాగిస్తారని చెప్పారు. సంస్కరణల ప్రక్రియలో ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు.
కాగా, విద్యార్థుల నిరసనతో ఝార్ఖండ్ ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థులపై టియర్ గ్యాస్, లాఠీఛార్జ్ వంటి ఘటనలు జరిగినా వారు నిరసనను కొనసాగించడంతో ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. దీంతో సోమవారం రాత్రి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షలతో సహా టీడీపీఎల్ సంస్థ ద్వారా నిర్వహించిన అన్ని పరీక్షలు, వాటి ఆధారంగా చేపట్టిన నియామకాలను రద్దు చేస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. అంతేకాకుండా 2014 నుంచి టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలపై సీఐడీ, రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీతో విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే విద్యార్థులు మాత్రం సీబీఐతో విచారణ జరిపించాలని పట్టుబడుతూ నిరసనను విరమించడానికి నిరాకరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన.. దిమాగీ నక్సల్ పార్టీ
శివాలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి