Share News

త్వరలో జంతర్‌మంతర్‌ సీజన్‌-2

ABN , Publish Date - Aug 13 , 2026 | 05:50 AM

జంతర్‌మంతర్‌ ‘సీజన్‌-2’ త్వరలోనే ఉంటుందని కాక్రోచ్‌ జనతాపార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు. సీజేపీ ఆధ్వర్యంలో త్వరలోనే మరో దేశవ్యాప్త ఉద్యమానికి...

త్వరలో జంతర్‌మంతర్‌ సీజన్‌-2

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 12: జంతర్‌మంతర్‌ ‘సీజన్‌-2’ త్వరలోనే ఉంటుందని కాక్రోచ్‌ జనతాపార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు. సీజేపీ ఆధ్వర్యంలో త్వరలోనే మరో దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. అయితే, ఏ అంశంపై ఈ ఉద్యమం ఉంటుందన్నదానిపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఢిల్లీలో బుధవారం తాము నిర్వహించతలపెట్టిన సీజేపీ వలంటీర్ల సమావేశం చివరి క్షణంలో రద్దు అయిన తర్వాత దీప్కే మీడియాతో మాట్లాడారు. ‘‘జంతర్‌మంతర్‌ సీజన్‌-2 ఎప్పుడని ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది అడుగుతున్నారు. వారందరికీ చెప్తున్నాను. సీజన్‌-2 అతిత్వరలో ప్రారంభం కాబోతోంది’’ అని తెలిపారు. తమ వలంటీర్ల సమావేశాన్ని బీజేపీనే అడ్డుకుందని దీప్కే ఈ సందర్భంగా ఆరోపించారు. ‘‘ఢిల్లీలో సమావేశం నిర్వహించడానికి హాల్‌ కోసం ఎన్నో చోట్ల తిరిగాం. అందరూ తమకు ‘పై నుంచి’ ఒత్తిడి ఉందని, హాల్‌ ఇవ్వలేమని చెప్పారు. చివరికి ఏదో ఒకరకంగా ఒక హాల్‌ను బుక్‌ చేసుకుంటే.. దాని యజమానిని కూడా బీజేపీ బెదిరించింది’’ అని పేర్కొన్నారు. ‘‘సీజేపీ సమావేశానికి హాల్‌ను ఇస్తే తలకిందులుగా వేలాడదీస్తాం’’ అంటూ యజమానిని బెదిరించారని చెప్పారు. దీన్ని బట్టి ఈ దేశ యువత అంటే బీజేపీ భయపడుతున్నట్లు స్పష్టమవుతోందని దీప్కే అన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడతామని, వెనకడుగు వేస్తామని అనుకోవడం వాళ్ల పొరపాటే అవుతుందన్నారు. ఇదే మీడియా సమావేశంలో సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్‌దాస్‌ మాట్లాడుతూ.. ‘‘తర్వాతి ఉద్యమానికి కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. ప్రజల సమస్యలు, వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆగస్టు 15నుంచి దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం’’ అని అన్నారు. కాగా, అభిజీత్‌ దీప్కే ఇటీవలి కాలంలో ఎక్కువగా పాఠశాల విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, కొత్త బడుల నిర్మాణం గురించి ఎక్కువగా పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనే దేశవ్యాప్త ఉద్యమం ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ బడుల బలోపేతంపై దేశవ్యాప్త క్యాంపెయిన్‌ ఉంటుందని దీప్కే కూడా బుధవారం ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

ఇవి కూడా చదవండి...

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 05:50 AM