Share News

ఉపా కేసులో ముగ్గురి అరెస్టు.. తీవ్రవాదులను కీర్తిస్తూ పుస్తకం ప్రచురించారని ఆరోపణ..

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:54 PM

ఉపా కేసులో ముగ్గురు నిందితులను జమ్మూ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ అరెస్టు చేసింది. 'పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్' అనే పుస్తకం ప్రచురణ, పంపిణీకి సంబంధించిన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఉపా కేసులో ముగ్గురి అరెస్టు.. తీవ్రవాదులను కీర్తిస్తూ పుస్తకం ప్రచురించారని ఆరోపణ..
UAPA Case

జమ్మూకాశ్మీర్: ఉపా (UAPA) కేసులో ముగ్గురు నిందితులను జమ్మూ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ (CIJ) అరెస్టు చేసింది. 'పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్' అనే పుస్తకం ప్రచురణ, పంపిణీకి సంబంధించి ముగ్గురు ప్రచురణకర్తలను సీఐజే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పుస్తకం తీవ్రవాదులు, వేర్పాటువాదులను కీర్తిస్తూ అతివాద భావజాలాన్ని ప్రచారం చేస్తోందని సీఐజే ఆరోపిస్తోంది. అరెస్టయిన నిందితుల్లో ఇద్దరు ఢిల్లీకి చెందినవారు కాగా.. మరొకరు జమ్మూకు చెందిన వ్యక్తిగా కేసు దర్యాప్తు అధికారులు తెలిపారు.


ఢిల్లీకి చెందిన నిందితుల్లో ఒకరు పుస్తకం ప్రచురణకు సంబంధించిన డిజిటల్ రికార్డులను తొలగించి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే, దర్యాప్తులో భాగంగా కీలకమైన ఆ డేటాను తిరిగి పొందినట్లు వెల్లడించారు. కాగా, ఢిల్లీ, జమ్మూలోని 'పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్' ప్రచురణ సంస్థలపై కొన్ని రోజుల కిందట సీఐజే బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా పుస్తకం ముద్రణ, సరఫరా, పంపిణీకి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని అరెస్టు చేశారు.


మరోవైపు పుస్తక రచయితల కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రచయితల్లో ఒకరైన సంతోశ్ మీనాను ప్రశ్నించేందుకు సీఐజే బృందం ఇప్పటికే రాజస్థాన్‌కు చేరుకుంది. అయితే, రెండో రచయితైన హిలాల్ అహ్మద్ ఆచూకీ ఇంకా లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఈ కేసులో ఇప్పటికే విద్యాశాఖకు చెందిన ఎనిమిది మంది అధికారులను సస్పెండ్ చేశారు. పుస్తక ప్రచురణకు ఆమోదం తెలిపిన సమగ్ర శిక్షా డైరెక్టరేట్‌పైనా కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ దాడులు నిర్వహించింది.


పుస్తకంలో ఏముంది?

'పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్' పుస్తకంలో పలువురు ఉగ్రవాదులు, వేర్పాటువాదులను జమ్మూకాశ్మీర్‌కు చెందిన ప్రముఖ వ్యక్తులుగా చిత్రీకరించే అధ్యాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1984లో బర్మింగ్‌హామ్‌లో భారత దౌత్యవేత్త అయిన రవీంద్ర మహాత్రేను హత్య చేసిన మక్బూల్ భట్‌ను గ్లోరిఫై చేసేలా ఈ పుస్తకంలో ఉందని అధికారులు తెలిపారు. అలాగే సయ్యద్ అలీ షా గీలనీ, మస్రత్ ఆలం, మీర్వైజ్ ఉమర్ ఫరూఖ్‌తో సహా వేర్పాటువాదులను జమ్మూకాశ్మీర్ గొప్ప వ్యక్తులుగా అభివర్ణించారని అధికారులు ఆరోపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మారువేషంలో బస్సు ఎక్కిన మంత్రి.. చిల్లర లేదని దింపేసిన కండక్టర్..

జిమ్‌లో నీళ్లు.. ఆగని వర్కవుట్లు.. వీడియో వైరల్

Updated Date - Jul 12 , 2026 | 06:00 PM