మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ధాబాలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు మృతి
ABN , Publish Date - Nov 19 , 2026 | 02:45 PM
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న లోడుతో అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాలను ఢీకొట్టి, చివరకు ధాబాలోకి దూసుకెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో భేడాఘాట్ సమీపంలోని NH-45 జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న లోడుతో అతివేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి రహదారి పక్కన పార్క్ చేసి ఉన్న బొలెరో, కారు, పికప్ వాహనాలతో పాటు పలు వాహనాలను బలంగా ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న రాజ్ ఫ్యామిలీ ధాబాలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బలరామ్, మోను, ధర్మేంద్ర అనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ధాబా యజమాని తీవ్రంగా గాయపడటంతో అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ధాబా సమీపంలో పలువురు మంట చుట్టూ చేరి చలి కాచుకుంటున్నట్లు సమాచారం.
ధాబాలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. డ్రైవర్ కోసం పోలీసుల గాలింపు..
ప్రమాదం ధాటికి ధాబాలోని కొంతభాగం ధ్వంసమవడంతో పాటు పార్క్ చేసిన వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ట్రక్కులోని భారీ మొత్తంలో మొక్కజొన్న రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. సమాచారం అందుకున్న భేడాఘాట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను భింద్-మొరేనా ప్రాంతానికి చెందిన బలరామ్, మద్యం దుకాణంలో పనిచేసే మోను, ధాబా సిబ్బంది ధర్మేంద్రగా గుర్తించారు. ట్రక్కు డ్రైవర్ వివరాలు ఇంకా తెలియరాలేదని.. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!