సీజే రాయ్ కేసు.. వెలుగులోకి 9 పేజీల సూసైడ్ నోట్
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:55 PM
సూసైడ్‌కు ముందు సీజే రాయ్ రాసిన తొమ్మిది పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
బెంగళూరు: సంచలనం సృష్టించిన కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ (CJ Roy) ఆత్మహత్య వ్యవహారంలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఐటీ సోదాలు జరుగుతుండగా రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూసైడ్‌కు ముందు ఆయన రాసిన తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ కుటుంబ సభ్యులకు అందినట్టు తెలుస్తోంది. ఈ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులతో ఆయన తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని కొన్ని వార్తా కథనాలు వెలువడగా, జనవరి 31న ఆయన తన సోదరుడితో ఫోనులో మాట్లాడినట్టు మరికొన్ని కథనాలు వచ్చాయి.
కాగా, రాయ్ ఆత్మహత్య ఘటనను విచారించేందుకు ఏర్పాటైన 'సిట్' ప్రస్తుతం సూసైడ్ నోట్‌ను పరిశీలిస్తోంది. ఈ నోట్‌లో రాయ్ వ్యక్తిగత, ఆర్థిక, వ్యాపార అంశాలను ప్రస్తావించినట్టు సిట్ వర్గాల సమాచారం. తనకు బాకీపడిన వారి వివరాలు, తన తర్వాత వ్యాపారం నిర్వహించే వారసుల పేర్లు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. చాలాకాలంగా తనతో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించవద్దని కూడా కోరారు. ఈ వివరాలపై మరింత లోతుగా విచారించేందుకు కుటుంబ సభ్యులు, కంపెనీ ఉద్యోగుల స్టేట్‌మెంట్లను సిట్ రికార్డు చేయనుంది. ఆ తర్వాతే రాయ్ మరణంపై ఒక స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఐటీ అధికారులను కూడా సిట్ మరోసారి ప్రశ్నించనుంది.
ఆదాయపు పన్ను అధికారుల ఒత్తిడే రాయ్ మరణానికి దారితీసిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే రాయ్ మరణానికి ముందు దాడులు జరిపిన ఐటీ అధికారులకూ, రాయ్‌కు మధ్య ఎలాంటి వాదోపవాదాలు జరగలేదని పోలీసులు చెబుతున్నారు. రాయ్ కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్ కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. ఐటీ జాయింట్ డైరెక్టర్‌తో సహా అధికారులను సిట్ ఇప్పటికే ప్రశ్నించింది. రాయ్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని అధికారులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్య ఘటన సమయంలో కార్యాలయంలో సోదాలు జరిపిన అధికారులు ఎక్కడికీ వెళ్లరాదని కూడా సిట్ ఆదేశించింది. రాయ్ మొబైల్ ఫోన్లను పరిశీలిస్తోంది. రాయ్‌కు ఎక్కడినుంచైనా బెదిరింపులు వచ్చాయా అనే కోణం నుంచి కూడా సిట్ దర్యాప్తు సాగిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. రాజ్‌నాథ్, అమిత్‌షా అభ్యంతరం
రోహిత్ శెట్టికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్.. అది ట్రైలర్ మాత్రమే..