Share News

2028 నాటికి భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

ABN , Publish Date - Oct 24 , 2026 | 07:27 AM

స్మార్ట్‌ఫోన్ రంగంలో భారత్‌ మరింత స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2028 అక్టోబర్ 23 నాటికి భారతీయులే రూపొందించి, భారత్‌లోనే తయారు చేసి, భారతీయ బ్రాండ్‌తో విక్రయించే మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.

2028 నాటికి భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Union Minister Ashwini Vaishnaw

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ రంగంలో భారత్‌ మరింత స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2028 అక్టోబర్ 23 నాటికి భారతీయులే రూపొందించి, భారత్‌లోనే తయారు చేసి, భారతీయ బ్రాండ్‌తో విక్రయించే మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబర్ 23న ఢిల్లీలో ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన వరల్డ్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ల మార్కెట్‌లో స్వయం సమృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. భారత్‌లో మొబైల్ ఫోన్ల తయారీ సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ, సొంత రూపకల్పన, సాంకేతిక పరిజ్ఞానం, బ్రాండ్ అభివృద్ధి వంటి అంశాల్లోనూ దేశం మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆపిల్, శామ్‌సంగ్ వంటి ప్రముఖ సంస్థలకు పోటీగా నిలవగల భారతీయ మొబైల్ బ్రాండ్‌ను అభివృద్ధి చేయాలన్నది ఈ లక్ష్యం వెనుక ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ రూపకల్పన అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని ఆయన వివరించారు. పరిమిత స్థలంలో యాంటెన్నా, రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థలు, ప్రాసెసర్, మెమరీ, కెమెరా మాడ్యూల్, డిస్‌ప్లే, విద్యుత్ నిర్వహణ వ్యవస్థ వంటి అనేక భాగాలను సమన్వయం చేయాల్సి ఉంటుందన్నారు. ఫోన్ బరువు, విద్యుత్ వినియోగం, పనితీరు వంటి అంశాలనూ సమతుల్యం చేయాల్సి ఉంటుందని చెప్పారు.


మూడేళ్ల కిందట భారతీయ డిజైనర్లకు మొబైల్ ఫోన్‌లో కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌ (పీసీబీ)ను రూపొందించాలని సవాల్ విసిరినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రయత్నంలో రెండు సంస్థలు ముందుకొచ్చాయన్నారు. వాటిలో ఒక సంస్థ రూపొందించిన డిజైన్‌కు అమెరికాలోని ప్రముఖ టెలికాం సేవల సంస్థ నుంచి గుర్తింపు లభించిందని వెల్లడించారు. ఆ సంస్థ 5జీ సామర్థ్యమున్న మొబైల్ ఫోన్‌ను రూపొందించి, అమెరికాలోని ఓ ప్రముఖ టెలికాం సేవల సంస్థకు అందించిందని, ఆ ఫోన్ తయారీ పూర్తయి వినియోగదారులకు చేరిందని వైష్ణవ్ చెప్పారు. గత మూడున్నరేళ్లలో అభివృద్ధి చేసిన ఈ సాంకేతిక సామర్థ్యాన్ని ఇప్పుడు భారతీయ బ్రాండ్, దేశీయ రూపకల్పన, భారతదేశంలోనే మేధో సంపత్తి హక్కులు కొనసాగించే దిశగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.


మరోవైపు, భారత్‌లో మొబైల్ ఫోన్లతో పాటు డ్రోన్లు, క్షిపణులు, రైళ్లు, ఆధునిక సాంకేతిక పరికరాల తయారీ కూడా విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు దేశ ఎగుమతుల్లో కీలక స్థానాన్ని సంపాదించాయని, ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ మూడో అతిపెద్ద ఎగుమతి విభాగంగా ఉందని ఆయన వెల్లడించారు. త్వరలోనే రెండో స్థానానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 1990 నుంచి 2004 వరకు ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు తయారీ రంగానికి అనుకూలంగా ఉన్నాయన్నారు. 2004–2014 మధ్య విధానపరమైన నియంత్రణ ధోరణి మళ్లీ పెరిగిందని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా దేశీయ తయారీకి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..

Updated Date - Oct 24 , 2026 | 07:27 AM