Share News

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:27 AM

కేంద్ర ఎన్నికల సంఘంలో కీలక అధికారి నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారంటూ ఎన్నికల కమిషనర్లు స్వయంగా కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు
election commission

  • ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు!

  • అదనపు బాధ్యతలు చేపట్టిన గంటల్లోనే

  • వివాదాస్పద పని విభజన ఉత్తర్వులిచ్చిన డిప్యూటీ ఈసీ మనీశ్‌ గార్గ్‌

  • తమ అనుమతి, సమాచారం లేకుండానేఈ ఉత్తర్వులు జారీ చేశారన్న ఎన్నికల కమిషనర్లు

  • ఐనా చర్యలు తీసుకోని కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి

  • రాజ్యాంగబద్ధ సంస్థలో జోక్యంగా భావించే

  • అవకాశం ఉందంటూ అంతర్గత నోట్‌లో నమోదు

  • ఆర్టీఐ దరఖాస్తుతో బయటికి వచ్చిన సమాచారం

న్యూఢిల్లీ, అక్టోబరు 23: కేంద్ర ఎన్నికల సంఘంలో కీలక అధికారి నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారంటూ ఎన్నికల కమిషనర్లు స్వయంగా కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా ఎన్నికల సంఘంలో జోక్యం చేసుకుంటున్నట్టు అవుతుందని పేర్కొన్నారు. ఆగస్టులో జరిగిన ఈ అంశానికి సంబంధించి సామాజిక ఉద్యమకారుడు లోకేశ్‌ కె బాత్రా దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తుకు తాజాగా అందిన సమాధానంలో ఈ వివరాలు బయటికి వచ్చాయి. ఈ ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు 9 వరకు ఎన్నికల సంఘం పరిపాలన విభాగం డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ భానుప్రకాశ్‌ సెలవుపై వెళ్లారు. దానితో సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ మనీశ్‌గార్గ్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు. మనీశ్‌ గార్గ్‌ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే.. ఎన్నికల సంఘంలో పని విభజనకు సంబంధించి పలు ఆదేశాలు జారీ చేశారు. తమ అనుమతి తీసుకోకుండానే, ఎలాంటి సమాచారం లేకుండానే పలు ఉత్తర్వులు జారీ చేశారని..ఆయనపై చర్యలు తీసుకోవాలని జూలై 29న కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌, వివేక్‌ జోషి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.


ఆ లేఖలపై ఆగస్టు 3, 4 తేదీల్లో కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో అంతర్గత చర్చ జరిగింది. 3వ తేదీన జరిగిన చర్చలో ఈ అంశంపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అభిప్రాయం కోరాలని కేబినెట్‌ సెక్రటేరియట్‌ అధికారులు నిర్ణయించారు. అయితే 4న రూపొందించి, కేంద్ర సిబ్బంది శాఖ(డీవోపీటీ)కు పంపిన నోట్‌లో మాత్రం..‘‘డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్లు కోరారు. అవి వ్యక్తిగతంగా రాసిన లేఖలు. వాటిని తీవ్రంగా పరిశీలించాల్సి ఉన్నా.. అధికారికంగా పూర్తి ఎన్నికల కమిషన్‌ నుంచి వచ్చిన ఫిర్యాదుగా పరిగణించలేం. చర్యలు చేపడితే ఎన్నికల కమిషన్‌ కార్యకలాపాల్లో జోక్యంగా భావించే అవకాశమూ ఉంది’’ అని పేర్కొన్నారు. మనీశ్‌గార్గ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఆ ఫిర్యాదులను, కేబినెట్‌ సెక్రటేరియట్‌ నోట్‌ను సీఈసీకి, డీవోపీటికి పంపారు.

Updated Date - Oct 24 , 2026 | 06:30 AM