Share News

రైల్వే టికెట్‌ రద్దు నిబంధనల్లో మార్పు

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:37 AM

రైల్వే టికెట్ల రద్దు నిబంధనలను భారతీయ రైల్వే సవరించింది. రైలు బయలుదేరడానికి ముందు సమయాన్ని బట్టి టికెట్‌ రద్దు చేసినప్పుడు రిఫండ్‌ ఎంత మొత్తం ప్రయాణికులకు చెల్లిస్తారో వెల్లడించింది...

రైల్వే టికెట్‌ రద్దు నిబంధనల్లో మార్పు

  • రైలు బయల్దేరడానికి 8 గంటల లోపు రద్దు చేస్తే నో రిఫండ్‌..24గంటల్లోపు అయితే 50 శాతం వెనక్కి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రైల్వే టికెట్ల రద్దు నిబంధనలను భారతీయ రైల్వే సవరించింది. రైలు బయలుదేరడానికి ముందు సమయాన్ని బట్టి టికెట్‌ రద్దు చేసినప్పుడు రిఫండ్‌ ఎంత మొత్తం ప్రయాణికులకు చెల్లిస్తారో వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం.. రైలు బయలుదేరడానికి 72 గంటల ముందు టికెట్‌ను రద్దు చేసుకుంటే కనీస చార్జీలు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని రిఫండ్‌ చేస్తారు. 72 గంటల నుంచి 24 గంటల మధ్య టికెట్‌ను రద్దు చేసినట్టయితే దాదాపు 25 శాతం మినహాయించుకుని మిగతా మొత్తాన్ని తిరిగి ఇస్తారు. రైలు బయలుదేరడానికి 24 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్‌ రద్దు చేస్తే టికెట్‌ ధరలో 50 శాతం వరకు మినహాయిస్తారు. ప్రయాణానికి 8 గంటలలోపు టికెట్‌ రద్దు చేస్తే మాత్రం ఎలాంటి రిఫండ్‌ ఉండదు. ఇంతకు ముందు ఇది 4 గంటలు ఉండేది. సవరించిన నిబంధనలను ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య విడతల వారీగా అమల్లోకి రానున్నాయి. కాగా ప్రయాణికులు తాము రైలు ఎక్కే స్టేషన్‌ను మార్చుకునే విషయంలోనూ కాస్త వెసులుబాటు కల్పించారు. ఇకపై ప్రయాణికులు రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్‌ స్టేషన్‌ను మార్చుకోవచ్చని రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. రైల్‌లో సీట్లు ఖాళీగా ఉంటే రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు వరకు కూడా క్లాస్‌ అప్‌డేషన్‌ అయ్యే వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. కాగా, రైల్వే చార్ట్‌ తయారీ సమయం 4 గంటల నుంచి 9-18 గంటల ముందుకు మారిందని, దీని వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ముందుగానే సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 03:37 AM