Share News

పొదుపు పెరిగింది.. అప్పులు అంతకంటే వేగంగా పెరిగాయి.. .. ఆర్‌బీఐ డేటాలో షాకింగ్‌ విషయాలు..

ABN , Publish Date - Sep 08 , 2026 | 05:46 PM

భారతీయ కుటుంబాలకు పొదుపు చేయడం అలవాటు. సంపాదించిన దాంట్లో కొత్త మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంటారు. అయినప్పటికీ వాళ్లు దాచుకుంటున్న దానికంటే వేగంగా అప్పులు పెరిగిపోతున్నాయి.

పొదుపు పెరిగింది.. అప్పులు అంతకంటే వేగంగా పెరిగాయి.. .. ఆర్‌బీఐ డేటాలో షాకింగ్‌ విషయాలు..
Indian household debt rising

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ కుటుంబాలకు పొదుపు చేయడం అలవాటు. సంపాదించిన దాంట్లో కొత్త మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంటారు. అయినప్పటికీ వాళ్లు దాచుకుంటున్న దానికంటే వేగంగా అప్పులు పెరిగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం భారతీయు కుటుంబాల ప్రతి రూ.100 పొదుపుకి రూ.27 అప్పు ఉండగా.. ఇప్పుడు ఆ మొత్తం రూ.32కు పెరిగింది (Indian household debt rising).


ఆర్‌బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 మార్చి నాటికి భారతీయ కుటుంబాల ఆర్థిక ఆస్తుల విలువ రూ.490.3 లక్షల కోట్లుగా ఉంది. ఇది దేశ జీడీపీలో 141.6 శాతానికి సమానం. అదే సమయంలో కుటుంబాల మొత్తం అప్పులు రూ.158.5 లక్షల కోట్లు. ఇది జీడీపీలో 45.8 శాతానికి సమానం. 2022 జూన్ నుంచి 2026 మార్చి వరకు 16 త్రైమాసికాల్లో భారతీయ కుటుంబాల అప్పులు 78 శాతం పెరిగాయి. ఇదే కాలంలో ఆర్థిక పొదుపులు 49 శాతం మాత్రమే పెరిగాయి. ఇదే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 41 శాతం వృద్ధి చెందింది. అంటే కుటుంబాల పొదుపులు, దేశ ఆర్థిక వ్యవస్థ కంటే అప్పుల పెరుగుదల చాలా వేగంగా సాగింది (RBI household debt).


సులభంగా చెప్పాలంటే.. కుటుంబాలు తమ వద్ద ఉన్న ఆస్తులను పెంచుకుంటూనే ఉన్నాయి. కానీ అదే సమయంలో అప్పుల భారం కూడా మరింత వేగంగా పెరుగుతోంది. కుటుంబాల పొదుపుల విషయంలో మరో మార్పు కూడా కనిపిస్తోంది. ఇప్పటికీ బ్యాంకు డిపాజిట్లే అతిపెద్ద వాటా కలిగి ఉన్నాయి. 2026 మార్చిలో మొత్తం కుటుంబ ఆర్థిక ఆస్తుల్లో బ్యాంకు డిపాజిట్ల వాటా 34.4 శాతంగా ఉంది. అయితే 2022 జూన్‌లో ఇది 36 శాతంగా ఉండేది. అంటే బ్యాంకు డిపాజిట్ల వాటా కొంత తగ్గింది (Financial savings India).


ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌ వాటా 6.4 శాతం నుంచి 10.5 శాతానికి పెరిగింది. నేరుగా షేర్లలో పెట్టుబడుల వాటా మాత్రం 20.1 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింది. భారతీయ కుటుంబాల అప్పుల్లో ఇప్పటికీ బ్యాంకులదే ప్రధాన వాటా. 2026 మార్చి నాటికి మొత్తం కుటుంబ అప్పుల్లో 81.3 శాతం బ్యాంకుల నుంచి తీసుకున్నవే. అయితే నాన్-బ్యాంకింగ్ సంస్థల నుంచి తీసుకునే అప్పుల వాటా కూడా వేగంగా పెరుగుతోంది. 2022 జూన్‌లో 9.8 శాతంగా ఉన్న ఈ వాటా.. 2026 మార్చికి 13.3 శాతానికి చేరింది.


ఇవి కూడా చదవండి..

సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. 73 మందికి గాయాలు..


హిందీ జాతీయ భాష.. శివ రాజ్‌కుమార్‌ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో దుమారం..

Updated Date - Sep 08 , 2026 | 06:20 PM