సుదూర శత్రువుపై ‘సూర్యాస్త్రం’
ABN , Publish Date - May 21 , 2026 | 05:19 AM
భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా, స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి సరికొత్త ఊతమిచ్చేలా మరో కీలక ముందడుగు పడింది. పుణెకు చెందిన...
300 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిన సూర్యాస్త్ర
సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థ పరీక్ష విజయవంతం
బాలాసోర్, మే 20: భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా, స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి సరికొత్త ఊతమిచ్చేలా మరో కీలక ముందడుగు పడింది. పుణెకు చెందిన ప్రైవేటు రక్షణ సంస్థ ‘నిబే లిమిటెడ్’ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ‘సూర్యాస్త్ర యూనివర్సల్ రాకెట్ లాంచర్’ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లో ఈ నెల 18, 19వ తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా సుదీర్ఘ దూరంలోని లక్ష్యాలను ‘సూర్యాస్త్ర’ అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో భారత సైన్యం అత్యవసర సేకరణ కింద నిబే లిమిటెడ్‌కు కీలకమైన కొనుగోలు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా సూర్యాస్త్ర యూనివర్సల్ రాకెట్ లాంచర్‌తోపాటు 150 కి.మీ., 300 కి.మీ. పరిధిగల రాకెట్ల అభివృద్ధి, సరఫరాను నిబే సంస్థ వేగవంతం చేసింది. ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో నిర్వహించిన టెస్టుల్లో సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థలో రెండు వేరియంట్లను పరీక్షించగా అవి అత్యంత కచ్చితత్వాన్ని ప్రదర్శించాయని ఆ సంస్థ తెలిపింది. 150 కి.మీ పరిధిగల రాకెట్ 1.5 మీటర్ల సీఈపీ (సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్)ని, 300 కి.మీ. పరిధి గల రాకెట్ 2.0 మీటర్ల సీఈపీని నమోదు చేసినట్టు పేర్కొంది. రక్షణ రంగంలో ఉపయోగించే మందుగుండు లేదా రాకెట్ సామర్థ్యంలో 50 శాతం పడిపోయే వ్యాసార్థాన్ని కొలిచే కొలమానాన్ని సీఈపీ అంటారు. ఈ వ్యాసార్థం ఎంత తక్కువగా ఉంటే.. ఆయుధం అంత కచ్చితంగా లక్ష్యాన్ని తాకినట్టు లెక్క. 300 కి.మీ. ప్రయాణించినా రెండు మీటర్ల కంటే తక్కువ వ్యాసార్థంలో లక్ష్యాన్ని దెబ్బతీయడం ద్వారా ప్రపంచంలోని అత్యంత కచ్చితమైన సుదూర రాకెట్ వ్యవస్థల్లో సూర్యాస్త్ర ఒకటిగా నిలిచింది. దీంతో భారత సైన్యం శత్రువుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, దాని చుట్టుపక్కల అదనపు ఆస్తి, ప్రాణనష్టం లేకుండా లక్షిత ప్రాంతాన్ని మాత్రమే ధ్వంసం చేయడానికి అవకాశం ఉంటుంది. సాంప్రదాయ ఫీల్డ్ రాకెట్లకు, భారీ బాలిస్టిక్ క్షిపణులకు మధ్య చాలా అంతరం ఉంది. ఈ అంతరాన్ని సూర్యాస్త్ర భర్తీ చేయనుంది. దీంతో అత్యంత సరళమైన, వేగంగా ప్రతిస్పందించే, తక్కువ ఖర్చుతో కూడిన ఆయుధ వ్యవస్థ మన సాయుధ దళాలకు అందుతుంది.
శత్రు శిబిరాలపై కచ్చితత్వంతో దాడులు..
సూర్యాస్త్ర అనేది మొట్టమొదటి స్వదేశీ, సార్వత్రిక, యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ దీర్ఘశ్రేణి రాకెట్ లాంచర్ వ్యవస్థ. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఇజ్రాయెల్ సాంకేతికత సహకారంతో పుణెకు చెందిన ‘నిబే లిమిటెడ్’ దీన్ని అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ 150 కి.మీ. నుంచి 300 కి.మీ. దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. శత్రు భూభాగంలోని కీలక స్థావరాలు, కమాండ్ సెంటర్లు, రాడార్ కేంద్రాలపై దాడులు చేసేందుకు దీన్ని రూపొందించారు. ఒకే లాంచర్ ప్లాట్‌ఫాం నుంచి ఎలాంటి హార్డ్‌వేర్ మార్పులు చేయకుండానే వివిధ పరిమాణాలు కలిగిన రాకెట్లను ప్రయోగించగలగడం ఈ వ్యవస్థ ప్రత్యేకత.
ఈ వార్తలు కూడా చదవండి...
జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం
స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు