Share News

సరిహద్దుల్లో శాంతి సవ్వడులు!

ABN , Publish Date - Jul 02 , 2026 | 06:19 AM

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయా? దశాబ్దాలుగా శత్రుత్వం, యుద్ధాలు, ఘర్షణలు, ఉగ్రవాద ఘటనలతో సాగుతున్న ఇరుదేశాల సంబంధాలు ఇప్పుడు శాంతి దిశగా...

సరిహద్దుల్లో శాంతి సవ్వడులు!

భారత్‌-పాక్‌ మధ్య శాశ్వత శాంతికి ప్రయత్నాలు

  • శాంతిపై ఇటీవల ఆర్‌ఎ్‌సఎస్‌ నేతల వ్యాఖ్యలు..శ్రీలంకలో అనధికార చర్చలు?

  • తాజాగా భారత్‌, పాక్‌ ప్రధానులకు 117 మంది ఇరుదేశాల ప్రముఖుల లేఖ

  • భారత్‌, పాక్‌ శత్రుత్వం వీడాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 1: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయా? దశాబ్దాలుగా శత్రుత్వం, యుద్ధాలు, ఘర్షణలు, ఉగ్రవాద ఘటనలతో సాగుతున్న ఇరుదేశాల సంబంధాలు ఇప్పుడు శాంతి దిశగా సాగుతున్నాయా? ఇటు ఆర్‌ఎ్‌సఎస్‌ ఒత్తిడి, అటు పాక్‌ నేతల నిర్ణయంతో.. ఇరుదేశాల మాజీ అధికారులు, దౌత్యవేత్తలు, పలువురు నేతలు శ్రీలంకలోని కొలంబోలో శాంతి చర్చలు జరిపారా? ఇటీవలి పరిణామాలన్నీ ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలే ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో సుస్థిర శాంతి కోసం భారత్‌-పాక్‌ ప్రభుత్వాలు ఈ ప్రయత్నాలకు వెన్నుతడుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి హొసబలే మాట్లాడుతూ.. పాక్‌తో చర్చలు జరపడానికి భారత్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. అనంతరం భారత్‌-పాక్‌ ప్రజల మధ్య సంబంధాలు ఉండాలని ఆర్‌ఎ్‌సఎస్‌ కీలక నేత సునీల్‌ అంబేకర్‌ కూడా పేర్కొన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ ఒత్తిడి నేపథ్యంలో.. ఇటీవల శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఒక సదస్సు నేపథ్యంలో భారత్‌-పాక్‌ బృందాల మధ్య అనధికారిక చర్చలు జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇందులో భారత్‌ తరఫున బీజేపీ నేత రాంమాధవ్‌, భారత ఆర్మీ మాజీ చీఫ్‌ నరవణే, పలువురు మాజీ దౌత్యవేత్తలు.. అటు పాక్‌ నుంచి రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ ఇస్ఫదియార్‌ అలీఖాన్‌ పటౌడీ, పలువురు మాజీ దౌత్యవేత్తలు పాల్గొని చర్చించినట్టు కథనాలు వచ్చాయి. భారత్‌, పాక్‌ ప్రభుత్వాల నుంచి అధికారికంగా ఎలాంటి స్పందనగానీ, ఖండన గానీ వెలువడలేదు. అయితే తాను పాక్‌ అధికారులతో చర్చలు జరిపానన్న వార్తలను రాంమాధవ్‌ మాత్రం ఖండించారు. మరోవైపు గ్రేటర్‌ బెంగళూరు ఎన్నికలకు బీజేపీ ఇన్‌చార్జిగా ఉన్న రాంమాధవ్‌ను తాము గమనిస్తున్నామని కర్ణాటక పీసీసీ చీఫ్‌ బీకే హరిప్రసాద్‌ బుధవారం పేర్కొన్నారు.


రాంమాధవ్‌ కొలంబో ఎందుకు వెళ్లారని, పాక్‌ ఐఎ్‌సఐ మాజీ అధికారితో ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, భారత్‌, పాకిస్థాన్‌ శత్రుత్వానికి ముగింపు పలకాలని ఇరుదేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, షెహబాజ్‌ షరీ్‌ఫలకు రెండు దేశాలకు చెందిన 117 మంది ప్రముఖులు బుధవారం లేఖ రాశారు. ‘సెంటర్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ ప్రోగ్రెస్‌’ పేరిట రాసిన ఈ లేఖపై భారత్‌కు చెందిన 61 మంది, పాక్‌కు చెందిన 56 మంది ప్రముఖులు సంతకాలు చేశారు. భారత ప్రముఖుల్లో ఎన్సీపీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా, కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ ఉన్నారు. అయితే, ఇరుదేశాల ప్రముఖుల లేఖను బీజేపీ కొట్టిపారేసింది. వారంతా పాకిస్థాన్‌ అనుకూల బృందంలోని వారని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త

Updated Date - Jul 02 , 2026 | 06:19 AM