హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్
ABN , Publish Date - Jul 01 , 2026 | 09:14 PM
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో అక్రమ వ్యాపారం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. కుళ్లిపోయిన చేపలు, రొయ్యలను రసాయనాలతో తాజాగా ఉన్నట్లుగా మార్చి విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని, అధిక సంఖ్యలో పాడైన చేపలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, జులై 1: నగరంలో కుళ్లిపోయిన చేపలు, రొయ్యలను రసాయనాలతో నిల్వ చేసి తాజాగా ఉన్నట్లుగా చూపిస్తూ విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మంగళహాట్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త దాడుల్లో ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తార ఫిషరీస్‌లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల సమయంలో సుమారు రూ.90 వేల విలువైన 100 కిలోల పాడైన రొయ్యలు, 162 కిలోల కుళ్లిన చేపలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చేపల నుంచి దుర్వాసన రాకుండా, అవి తాజాగా కనిపించేలా ఉపయోగిస్తున్న 10 కిలోల సోడియం బైకార్బోనేట్ పౌడర్‌ను కూడా సీజ్ చేశారు.
ప్రాథమిక విచారణలో నిందితులు బేగంబజార్ ప్రాంతం నుంచి తక్కువ ధరకే పాడైన చేపలు, రొయ్యలను కొనుగోలు చేసి, రసాయనాలతో శుభ్రపరిచి తాజాగా ఉన్నట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ చేపలను హోటళ్లు, శుభకార్యాలు, వివిధ ఈవెంట్లకు కూడా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జనావాసాల మధ్య అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో చేపలను నిల్వ చేయడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా నాసిరకం, కుళ్లిపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
విరిగిపడిన కొండచరియ.. తృటిలో తప్పించుకున్న బైకర్
ఒడ్డుకు కొట్టుకొచ్చిన 26 అడుగుల తిమింగలం పిల్ల.. చివరికి..