Share News

ఒడ్డుకు కొట్టుకొచ్చిన 26 అడుగుల తిమింగలం పిల్ల.. చివరికి..

ABN , Publish Date - Jun 30 , 2026 | 08:05 AM

ముంబై బాంద్రా సముద్ర తీరంలో ఆదివారం ఒడ్డుకు కొట్టుకొచ్చిన 26 అడుగుల హంప్‌బ్యాక్ తిమింగలం పిల్ల మృతిచెందింది. సంబంధిత అధికారులు దానిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ చివరికి ప్రాణాలు కోల్పోయింది.

ఒడ్డుకు కొట్టుకొచ్చిన 26 అడుగుల తిమింగలం పిల్ల.. చివరికి..
Humpback whale

ముంబై: బాంద్రా సముద్ర తీరంలో ఆదివారం ఒడ్డుకు కొట్టుకొచ్చిన 26 అడుగుల హంప్‌బ్యాక్ తిమింగలం పిల్ల (వేల్ కాల్ఫ్) ప్రాణాలు కోల్పోయింది. అటవీశాఖ, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), ముంబై అగ్నిమాపక దళం, వన్యప్రాణి వైద్య నిపుణులు గంటల తరబడి శ్రమించినప్పటికీ దానిని కాపాడలేకపోయారు. బాంద్రా-వెర్సోవా సీ లింక్ నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు కార్టర్ క్లబ్ సమీపంలోని తీరానికి తిమింగలం పిల్ల కొట్టుకొచ్చినట్లు గుర్తించారు. అధికారులకు సమాచారం అందించడంతో అత్యవసర సహాయక చర్యలు ప్రారంభించారు.


తిమింగలాన్ని సురక్షితంగా అరేబియా సముద్రంలోకి తిరిగి పంపేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే కొద్దిసేపటి తర్వాత అది పూర్తిగా కదలడం ఆగిపోయింది. పరీక్షించిన అటవీశాఖ అధికారులు, స్థానిక మత్స్యకారులు తిమింగలం పిల్ల మృతిచెందినట్లు నిర్ధారించారు. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర క్షీరదాల్లో హంప్‌బ్యాక్ తిమింగలాలు ఒకటి. పూర్తిగా ఎదిగిన తిమింగలాలు సుమారు 50 నుంచి 60 అడుగుల వరకు పెరుగుతాయి. వేల కిలోమీటర్ల దూరం వలస వెళ్లే ఈ జీవులు చల్లని సముద్ర ప్రాంతాల్లో ఆహారం తీసుకుని, సంతానోత్పత్తి కోసం ఉష్ణమండల సముద్రాల వైపునకు ప్రయాణిస్తాయి.


అలాంటి సందర్భాల్లో తల్లి నుంచి విడిపోవడం, అనారోగ్యం, గాయాలు, బలమైన సముద్ర ప్రవాహాలు, అలలు వంటి కారణాలతో చిన్న తిమింగలాలు దారి తప్పి ఒడ్డుకు చేరే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ముంబై తీరంలో ఇవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయని తెలిపారు. తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చి మృతి చెందడానికి గల కచ్చితమైన కారణాన్ని పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనల ప్రకారం అవసరమైన పరీక్షలు, నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత తిమింగలం మృతదేహాన్ని ఖననం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలనూ చదవండి:

'అందుకే నాకు భారత్ అంటే ఇష్టం'.. పోలండ్ మహిళ వీడియో వైరల్

నెదర్లాండ్స్‌లో భగ్గుమంటున్న ఎండలు.. ఆరుబయటే ఆమ్లెట్ వేసిన యువకుడు

Updated Date - Jun 30 , 2026 | 09:14 AM